- డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి
నల్గొండ అర్బన్, వెలుగు: ప్రాథమిక వ్యవసాయ సహకార పరిపతి సంఘాలను మల్టీ సర్వీస్ సెంటర్లుగా అభివృద్ధి చేస్తామని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి చెప్పారు.
శనివారం నిర్వహించిన డీసీసీబీ డైరెక్టర్స్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నాబార్డు సహకారంతో 50 మల్టీ సర్వీస్ సెంటర్లు నడుస్తున్నాయని, ఒక శాతం వడ్డీతో రూ.2కోట్ల రుణాలు అందజేస్తున్నారని చెప్పారు. 50 సెంటర్ల కాలపరిమితిని మరో మూడేళ్లు పొడగిస్తున్నామని, 2026 వరకు పనిచేస్తాయని వివరించారు.
దీంతో పాటు వడ్లు నిల్వ చేసుకునేందుకు గో దాముల నిర్మాణం చేపడతామని, రైతుల ఆరోగ్యానికి అవసరమయ్యే మందులు పంపిణీ చేస్తారని తెలిపారు. పీఏసీఎస్‌ల ద్వారా కర్షక మిత్ర, గృహ రుణాలు పెద్ద ఎత్తున ఇస్తున్నామని, త్వరలో మరిన్ని సేవలు అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు.
సీఈవో పోస్టు ఖాళీ..
డీసీసీబీ సీఈవో మధన్ మోహన్ పదవీ కాలం జనవరి 17తో ముగియనుంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగాలేకపోవడంతో సెలవులో వెళ్లారు. దీంతో సీఈవో పోస్టుకు నోటిఫికేషన్ జారీ చేశారు. రాష్ట్ర స్థాయి కమిటీ సూచనల మేరకు త్వరలో కొత్త సీఈవోను నియమించనున్నారు.