ఖమ్మం, వెలుగు : జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ) చైర్మన్ కూరాకుల నాగభూషణం పదవిపై ఇవాళ స్పష్టత రానుంది. ఆయన చైర్మన్ గా ఎన్నికైన వి.వెంకటాయపాలెం సొసైటీలో శనివారం అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగనుంది. రెండు వారాల కింద మొత్తం 13 మందికి గాను 11 మంది డైరెక్టర్లు అవిశ్వాసం పెట్టగా, ఒక్కరు మాత్రమే నాగభూషణంకు అనుకూలంగా ఉన్నారు.
అవిశ్వాసానికి అనుకూలంగా ఉన్న సభ్యులు రెండువారాలుగా హైదరాబాద్, వైజాగ్ సహా పలు ప్రాంతాల్లో క్యాంపులో ఉన్నారు. నేరుగా అవిశ్వాసం సమయానికి వారంతా ఖమ్మం చేరుకోనున్నారు. అవిశ్వాసంలో ఆయన ఓడిపోతే, సొసైటీ చైర్మన్ పదవిని కోల్పోతారు. అప్పుడు డీసీసీబీ చైర్మన్ గా కొనసాగే అర్హతను కూడా కోల్పోతారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయ పరిణామాలు మారే అవకాశం కనిపిస్తోంది.
ఈ కారణంగా శనివారం ఏం జరుగుతుందన్నది ఆసక్తిగా మారింది. ఇప్పటికే డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావుపై అనర్హత వేటు పడడంతో ఆయన పదవిని కోల్పోయారు. డీసీసీబీలో తీసుకున్న కారు లోను ఈఎంఐలను మూడేళ్లపాటు చెల్లించకపోవడంతో, ఆయన డిఫాల్టర్‌గా మారారు. ఆయనను అనర్హుడిగా ప్రకటిస్తూ సహకార శాఖ అధికారులు ఆదేశాలిచ్చారు. దీంతో కాంగ్రెస్ కు చెందిన వైస్ చైర్మన్ కొత్వాల్ శ్రీనివాసరావు డీసీఎంఎస్ చైర్మన్ గా అయ్యారు. ఇప్పుడు డీసీసీబీ చైర్మన్ పదవిని కూడా కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ప్రస్తుత పాలకవర్గానికి గడువు
ఉంది.