న్యూఢిల్లీ: సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ‘కొవిషీల్డ్’ కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ జరుగుతున్న చెన్నై ప్రాంతానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ), ఇన్‌స్టిట్యూషనల్ ఎథిక్స్ కమిటీ (ఐఈసీ) చేరుకున్నాయి. వ్యాక్సిన్ తీసుకున్న ఓ వ్యక్తికి దాని వల్లే సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయో లేదో పరిశీలిస్తున్నాయి. తొందరపాటు నిర్ణయాలు సరికాదని.. వ్యాక్సిన్ ట్రయల్స్ ఆరోపణలపై డీసీజీఐ, ఐఈసీ దర్యాప్తు చేస్తున్నాయని ఐసీఎంఆర్ ఎపిడమాలజీ అండ్ కమ్యూనికబుల్ డిసీజ్ డివిజన్ హెడ్ డాక్టర్ సమిరన్ పాండా చెప్పారు. చెన్నై శ్రీరామచంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌లో అక్టోబర్ 1న డోస్ తీసుకున్న చెన్నైకి చెందిన ఓ బిజినెస్ కన్సల్టెంట్ తనకు న్యూరోలాజికల్, ఫిజియోలాజికల్ వచ్చాయని ఆరోపించిన విషయం తెలిసిందే. కంపెనీ నుంచి రూ.5 కోట్ల పరిహారం డిమాండ్‌తో పాటు వ్యాక్సిన్ టెస్టింగ్, తయారీ, డిస్ట్రిబ్యూషన్ ఆపేయాలన్నారు. ఈ వ్యాక్సిన్‌ను ఆక్స్‌ఫర్డ్, ఆస్ట్రాజెనికా కలిసి డెవలప్ చేస్తున్నాయి. వ్యాక్సిన్ రిజల్ట్స్ సరిగా లేకపోవడంతో 2, 3వ ఫేజ్ ట్రయల్స్ ఆపేయాలని సెప్టెంబర్ 11నే సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌ను డీసీజీఐ ఆదేశించినా.. సెప్టెంబర్ 15న ట్రయల్స్‌కు మళ్లీ ఓకే చెప్పింది.
అవన్నీ తప్పుడు ఆరోపణలు.. 100 కోట్లకు దావా వేస్తం: సీరమ్
కొవిషీల్డ్ వ్యాక్సిన్‌తో సీరియస్ సైడ్ఎఫెక్ట్స్ ఉంటాయన్న వలంటీర్ ఆరోపణలను సీరమ్ కంపెనీ కొట్టిపారేసింది. తప్పుడు ఆరోపణలతో కంపెనీపై బురదజల్లే ప్రయత్నం చేసినందుకు సదరు వలంటీర్ పై వంద కోట్లకు దావా వేయనున్నట్లు తెలిపింది. వ్యాక్సిన్ ట్రయల్స్‌లో పాల్గొన్న వలంటీర్ అనారోగ్యానికి గురవడంపై సంస్థ సానుభూతి వ్యక్తం చేసింది. ఆయన అనారోగ్యానికి, వ్యాక్సిన్‌కు ఎలాంటి సంబంధంలేదని స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని కంపెనీ డాక్టర్ల టీమ్ వివరించి చెప్పినా ఆ వలంటీర్ జనంలోకి వెళ్లి, కంపెనీపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడని విమర్శించింది. ఈ క్రమంలో కంపెనీ రెప్యుటేషన్‌ను దెబ్బతీసే ప్రయత్నం చేసినందుకుగాను సదరు వలంటీర్‌పై నష్టపరిహారం కోసం కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపింది. ఈమేరకు ఆదివారం సీరమ్ కంపెనీ ఓ ప్రకటన విడుదల చేసింది.