ఘట్కేసర్, వెలుగు : ఘట్ కేసర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో డీసీఎం వ్యాన్ అదుపు తప్పడంతో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన పొట్టోళ్ల బాలయ్య నగరంలోని ఎన్టీఆర్ నగర్ లో ఉంటున్నాడు. శనివారం సాయంత్రం తన మనవరాలు పుట్టువెంట్రుకలు తీయడానికి కుటుంబసభ్యులు, బంధువులతో కలిసి డీసీఎం వ్యాన్‌లో యాదగిరిగుట్టకు వెళ్లాడు.
కార్యక్రమం పూర్తయ్యాక ఆదివారం సాయంత్రం తిరిగి వస్తుండగా ఘట్కేసర్ బైపాస్ రోడ్డులోని మైసమ్మగుట్ట దగ్గర బ్రేకులు ఫెయిలయ్యాయి. దీంతో డీసీఎంను సర్వీస్ రోడ్డుపైకి మళ్లించగా డీసీఎం ముందు వెళ్తున్న ఆరు బైకులను ఢీకొట్టుకుంటూ పల్టీ కొట్టింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఏదులాబాద్కు చెందిన మంజుల, చందన, విగ్నేష్, భవ్యశ్రీ, యశ్వంత్‌లతో పాటు వ్యాన్‌లో ఉన్న పది మంది తీవ్రంగా గాయపడ్డారు.
డ్రైవర్ జంగయ్యచారి పరారీ కాగా, గాయపడ్డవారిని ఘట్కేసర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. తీవ్రంగా గాయపడిన కొందరిని నగరంలోని ఓ ప్రైవేటు దవాఖానకు, మరికొంత మందిని గాంధీకి తరలించారు. డీసీఎం వ్యాన్‌ను పోలీస్స్టేషన్తరలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు అడ్మిన్ ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.