- ధాన్యం కొనుగోళ్ల కమీషన్ఇవ్వకుండా సతాయింపు
- డబ్బులకు బదులు ఎరువులు అంటగడ్తున్న కరీంనగర్ ఆఫీసర్
- మేనేజర్, క్యాషియర్ పట్టివేత
కరీంనగర్ క్రైం, వెలుగు : ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన కమీషన్ డబ్బులు ఇవ్వకుండా ఎరువులు తీసుకోవాలంటూ సతాయిస్తూ అందులోనూ కమిషన్ తీసుకుంటున్న డీసీఎమ్మెఎస్ మేనేజర్ ను ఏసీబీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఇందుర్తి గ్రామానికి చెందిన కావాటి రాజు స్థానిక డీసీఎంఎస్ అనుసంధానంతో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి వడ్లు కొన్నాడు. వడ్లు కొన్న తర్వాత సివిల్ సప్లయీస్ ఆఫీసర్లు చెప్పిన వారికి వడ్లు పంపించాడు.
2018 నుంచి కొన్న వడ్ల కమీషన్ డబ్బులు రూ. 90,166 ,52 డీసీఎంఎస్ నుంచి రావాల్సి ఉంది. వీటిని ఇవ్వకుండా కరీంనగర్ డీసీఎమ్మెస్ మేనేజర్ వెంకటేశ్వర్ రావు ఆఫీసు చుట్టూ తిప్పించుకుంటున్నాడు. ఈ సీజన్లో ఎరువులు అమ్మితే తనకు కమిషన్వస్తుందని, అందుకని డబ్బులకు బదులు ఎరువులు తీసుకువెళ్లి అమ్ముకోవాలని రాజుకు సలహా ఇచ్చాడు. అతడు ఒప్పుకోకపోయినా విడతల వారీగా రూ.20 లక్షల విలువైన ఎరువులను అంటగట్టాడు.
తన దగ్గర ఎరువులు ఎవరూ కొనడం లేదని, ఎరువులు అమ్మడం తన వల్ల కాదని, తన డబ్బులు తనకు ఇవ్వాలని రాజు మేనేజర్ వెంకటేశ్వర్రావును బతిమాలుకున్నాడు. డబ్బులు ఇచ్చేది లేదని, మరో 15 ట్రిప్పుల ఎరువులు పంపిస్తానని స్పష్టం చేశాడు. అందులోనూ ట్రిప్పుకు రూ.లక్ష కమీషన్ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
దీంతో రాజు ఏసీబీని ఆశ్రయించాడు. గురువారం డీసీఎమ్మెస్ ఆఫీసులో రూ.లక్షను మేనేజర్ వెంకటేశ్వర్రావుతో పాటు క్యాషియర్ కుమారస్వామి తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ రమణ మూర్తి, ఇతర ఆఫీసర్లు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.