ఆగని అసమ్మతి.. బీఆర్‌‌ఎస్‌కు గుడ్‌బై చెప్పనున్న డీసీఎంఎస్ చైర్మన్ 

  • సూర్యాపేట టికెట్‌ బీసీలకు ఇవ్వకపోవడంపై అలక
  • పార్టీ ఏదైనా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటన
  • ఇప్పటికే ప్రధాన పార్టీలతో చర్చలు
  • ఈ నెల 31న అనుచరులతో భారీ మీటింగ్

సూర్యాపేట, వెలుగు: బీఆర్‌‌ఎస్‌లో అసమ్మతి పోరు కొనసాగుతూనే ఉంది. సిట్టింగ్‌లకే టికెట్‌ ఇవ్వడంపై కొందరు,  బీసీలను అన్యాయం జరిగిందని మరి కొందరు అసంతృప్తిని వెల్లగక్కుతున్నారు. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో మీటింగ్‌లు పెట్టి భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తున్నారు. డీసీఎంఎస్‌ చైర్మన్‌ వట్టే జానయ్య కూడా ఇదే ఇదే బాటలో నడిచేందుకు సిద్ధమయ్యారు. సూర్యాపేట టికెట్‌ బీసీలకు ఇవ్వకపోడంతో అసంతృప్తిగా ఉన్న ఆయన తర్వలోనే బీఆర్‌‌ఎస్‌ను వీడనున్నట్లు ప్రకటించారు. పార్టీ ఏదైనా.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఈ మేరకు ఈ నెల 31న అనుచరులతో భారీస్థాయిలో మీటింగ్‌ పెట్టనున్నమని వెల్లడించారు. 

2009 నుంచి ఓసీలకే..

సూర్యాపేట నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడ్​ నుంచి జనరల్‌ స్థానంగా మారిన తర్వాత  2009 నుంచి 2018 వరకు మూడుసార్లు జరిగిన ఎన్నికల్లో ప్రధాన పార్టీలు  ఓసీలకే టికెట్లు ఇచ్చాయి.  బీఆర్‌‌ఎస్‌ నుంచి గత రెండు పర్యాయాలు జగదీశ్‌ రెడ్డి గెలిచిన విషయం తెలిసిందే. ఈ సారైనా బీసీలకు టికెట్‌ వస్తుందని ఆ వర్గాల నేతలు ఆశించినా.. కేసీఆర్‌‌ మళ్లీ జగదీశ్‌ రెడ్డికే టికెట్‌ ఇచ్చారు. దీంతో ఇక్కడి నుంచి టికెట్ ఆశించిన డీసీఎంఎస్‌ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్‌కు నిరాశ తప్పలేదు.

దీంతో తనదారి తాను చూసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే తన అనుచరులతో అంతర్గతంగా భేటీ అయిన ఆయన ఈ నెల 31న 2 మంది ముఖ్య అనుచరులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి బీఆర్‌‌ఎస్‌కు రాజీనామా చేయనున్నారు. అదే రోజు ఏ పార్టీలో చేరుతారనేదానిపైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా సెప్టెంబర్ మొదటి వారంలో బీఆర్‌‌ఎస్‌ అసంతృప్తి నేతలతో పాటు బీసీ నాయకులతో కలిపి సూర్యాపేటలో 50వేల మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు.  

ప్రధాన పార్టీలతో చర్చలు

సూర్యాపేట నియోజక వర్గంలో మంత్రి జగదీశ్‌ రెడ్డి తర్వాత అంతటి పేరున్న వట్టే జానయ్య యాదవ్ ప్రధాన పార్టీలతో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది.  ఇటీవల ఒక జాతీయ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేసినా కొన్నికారణాలతో ఫైనల్ కాలేదు. కాంగ్రెస్‌, బీజేపీతో పాటు బీఎస్పీ పెద్దలతోనూ టచ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అనుచరుల అభిప్రాయం మేరకు నిర్ణయం ఉండనుందని తెలిసింది.

సాగర్‌‌ అభ్యర్థిని మార్చాలి

హాలియా, వెలుగు:   నాగార్జునసాగర్ బీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌ను మార్చాలని ఆసమ్మతి నేతలు డిమాండ్​ చేశారు. శుక్రవారం గుర్రంపోడు మండలం బొల్లారం లో జడ్పీటీసీ గాలి సరిత రవికుమార్ ఆధ్వర్యంలో ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులు మీటింగ్‌ పెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  స్థానికులకే ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వాలని, లేదంటే పార్టీకి నష్టం జరుగుతుందని వాపోయారు. కేసీఆర్​ తమను పార్టీ నుంచి సస్పెండ్​ చేసినా పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో తిరుమలగిరి, పెద్దవూర ఎంపీపీలు ఆంగోతు భగవాన్​ నాయక్​, ​ చెన్ను అనురాధ సుందర్​ రెడ్డి, వైస్​ఎంపీపీ యడవల్లి దిలీప్​ రెడ్డి,  నాయకులు పాశం గోపాల్ రెడ్డి, వెలగపూడి కర్ణాకర్రావు, బల్గూరి నగేశ్, అకంతి వెంకటరమణ, అల్లి పెద్దిరాజు, బుర్రి రాంరెడ్డి, సయ్యద్​మియా, కిరణ్​ పాల్గొన్నారు.