శనిగకుంట మత్తడి ధ్వంసం కేసులో మరో ఏడుగురు అరెస్ట్ : డీసీపీ ఏ.భాస్కర్

శనిగకుంట మత్తడి ధ్వంసం కేసులో మరో ఏడుగురు అరెస్ట్ : డీసీపీ ఏ.భాస్కర్
  • పరారీలో ఉన్న ముగ్గురి కోసం గాలింపు
  • 14 మందిని నిందితులుగాచేర్చిన పోలీసులు
  •  కేసు వివరాలు వెల్లడించిన డీసీపీ భాస్కర్

చెన్నూరు, వెలుగు: మంచిర్యాల జిల్లా చెన్నూరు శివారులోని శనిగకుంట చెరువు మత్తడిని జిలెటిన్ స్టిక్స్​తో ధ్వంసం చేసిన కేసులో మరో ఏడుగురిని అరెస్టు చేశామని డీసీపీ ఏ.భాస్కర్ తెలిపారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారని చెప్పారు. చెన్నూరు పోలీస్ స్టేషన్​లో గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేసు వివరాలను వెల్లడించారు. సెప్టెంబర్ 16న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పేలుడు పదార్థాలతో శనిగకుంట చెరువు మత్తడిని ధ్వంసం చేశారని చెన్నూరు ఇరిగేషన్ ఏఈఈ ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని తెలిపారు. సెప్టెంబర్ 20న ప్రధాన నిందితులైన ఏ1 పెండ్యాల లక్ష్మీనారాయణ, ఏ2 భీం మధుకర్, ఏ3 రాసమల్ల శ్రీనివాస్, ఏ4 గోగుల దానయ్యను అరెస్టు చేశామన్నారు. తాజాగా ఏ7 నడిపెల్లి లక్ష్మణ్ రావు, ఏ8 మందాల రాజబాపు, ఏ9 పెద్దింటి శ్రీనివాస్, ఏ10 లక్కం రాజబాపు, ఏ11 పోగుల శేఖర్, ఏ12 ఇప్ప సంపత్, ఏ13 ఉమేష్ గిల్దాలను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఏ5 బత్తుల సమ్మయ్య, ఏ6 రాంలాల్ గిల్డా, ఏ14 ఎన్నం బానయ్య పరారీలో ఉన్నారని చెప్పారు.

భూమిలోకి నీళ్లు రావద్దనే..

వర్షాకాలంలో శనిగకుంట చెరువు నిండిపోవడంతో 11వ వార్డులోని ఇండ్లు ముంపునకు గురవుతున్నాయి. అలాగే, చెరువును ఆనుకొని ఉన్న 15.20 ఎక రాల భూమిని నిందితులంతా గ్రూప్ గా ఏర్పడి గోదావరిఖనికి చెందిన  బుచ్చిరెడ్డి దగ్గర కొనుగోలు చేశారు. ఈ భూమిని 2022, ఫిబ్రవరిలో చెన్నూరుకు చెందిన గొడిశెల బాపురెడ్డికి అమ్మేందుకు రూ.7.50 కోట్లకు అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇప్పటి దాకా బాపురెడ్డి రూ.4 కోట్లు చెల్లించాడు. కానీ, అందులో 4.20 ఎకరాలే రిజిస్ట్రేషన్ కాగా, 11 ఎకరాలు శని గకుంట ఎఫ్​టీఎల్, బఫర్ జోన్​లో ఉండడంతో రిజి స్ట్రేషన్ కాలేదు.

వర్షాకాలంలో చెరువు నిండిపోవడంతో భూమిలోకి నీళ్లు వస్తాయని చెరువు వైపు మట్టి పోయించారు. అప్పటి నుంచి 11వ వార్డులోని ఇండ్లకు ముంపు సమస్య పెరిగింది. 2022, సెప్టెంబర్​లో ఇరిగేషన్ డీఈఈ ఎఫ్​టీఎల్, బఫర్ జోన్​లో ఎలాంటి నిర్మాణాలు చేయవద్దని నోటీసులు జారీ చేశారు. అయినా, అప్పటి తహసీల్దార్​ రూల్స్​కు విరుద్ధంగా 2023, జనవరిలో నాలా పర్మిషన్ ఇచ్చారు. ప్రతి ఏడాది చెరువు నిండి నీళ్లు రావడంతో ఆ భూమి తనకు వద్దని, డబ్బులు వాపస్​ ఇవ్వాలని బాపురెడ్డి ఒత్తిడి చేశాడు.

జిలెటిన్ స్టిక్స్​తో పేల్చివేత

చెరువు నీళ్లు ఇండ్లలోకి వస్తున్నాయని, మత్తడిని ధ్వం సం చేయాలని పెండ్యాల లక్ష్మీనారాయణ, అతని ఫ్రెండ్ భీం మధుకర్​ను బత్తుల సమ్మయ్య, మిగిలిన వాళ్లు రెచ్చగొట్టారు. నాలుగు లక్షలు ఇస్తామని, మ త్తడిని పేల్చేయాలని, తర్వాత ఏం జరిగినా తాము చూసుకుంటామని నమ్మబలికారు. ఇద్దరికి తలో లక్ష రూపాయలిచ్చారు.

మత్తడి ధ్వంసం చేశాక మిగిలిన డబ్బులిస్తామని చెప్పారు. దీంతో లక్ష్మీనారాయణ, మధుకర్.. దానయ్యతో కలిసి సెప్టెంబర్ 13న డ్రిల్లింగ్ మిషన్​తో మత్తడి ధ్వంసం చేసేందుకు ప్రయత్నించగా సాధ్యం కాలేదు. తర్వాత దానయ్య నల్గొండలో తనకు తెలిసిన వారి వద్ద నుంచి జిలెటిన్ స్టిక్స్ తీసుకొచ్చి మత్తడిని బ్లాస్ట్ చేశారని డీసీపీ భాస్కర్ తెలిపారు.