పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా బుధవారం రాత్రి హైదరాబాద్ లోని జరిగిన సంధ్య థియేటర్ ఘటనపై టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టీమ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విషయంపై హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ స్పందించారు. ఇందులోభాగంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందిందని, బాలుడు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడని తెలిపారు. ఈ క్రమంలో థియేటర్ యాజమాన్యంతోపాటు అక్కడ ఉన్న సెక్యూరిటి సిబ్బంది, అల్లు అర్జున్ పై కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కేసుని పలు కోణాలలో విచారిస్తున్నామని త్వరలోనే ఏ1,ఏ2 ఎవరనేది వెళ్లాడిస్తామని అన్నారు.
అల్లు అర్జున్ టీంపై బీఎన్ఎస్ చట్టంలోని సెక్షన్ 105, 118(1)r/w3(5) BNS యాక్ట్ కింద కేసు నమోదు చేశామని తెలిపారు. ఇక అల్లు అర్జున్ ఈ థియేటర్‌కు వస్తున్న సందర్భంలో భద్రతాపరమైన నిర్లక్ష్యం వహించినందుకు సంధ్య థియేటర్ యాజమాన్యంపై కూడా కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. అయితే అల్లు అర్జున్ థియేటర్ కి వచ్చే సమయంలో ఎలాంటి ముందస్తు భద్రతా చర్యలు తీసుకోలేదని అన్నారు. థియేటర్‌లోకి వచ్చే వారిని అదుపు చేసేందుకు ఎంట్రీ, ఎగ్జిట్‌లో ప్రైవేటు సెక్యూరిటీని ఏర్పాటు చేయలేదని అన్నారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని బాధ్యులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ విషయం ఇలా ఉండగా బుధవారం రాత్రి 9:30 గంటలకి పుష్ప2 సినిమా ప్రీమియర్స్ వేశారు. దీంతో అల్లు అర్జున్ సినిమా చూసేందుకు తన కుటుంబ సభ్యులతో కలసి సంధ్య థియేటర్ కి వచ్చాడు. అప్పటికే ఫ్యాన్స్ ఎక్కువగా ఉండటంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారడు శ్రీతేజ తీవ్ర అస్వస్థతకి గురయ్యాడు.