గంజాయి దందా చేస్తున్న ఆరుగురి అరెస్ట్

గంజాయి దందా చేస్తున్న ఆరుగురి అరెస్ట్
  • అందరూ యువకులే.. ఒకరు సింగరేణి ఉద్యోగి    
  • కేజీన్నర గంజాయి, రూ.40 వేల నగదు, బైక్ స్వాదీనం

జైపూర్, వెలుగు: భీమారంలో గంజాయి రవాణా చేస్తున్న నిందితులను అరెస్టు చేశామని మంచిర్యాల డీసీపీ భాస్కర్ తెలిపారు. గురువారం జైపూర్ ఏసీపీ ఆఫీసులో ఏసీపీ వెంకటేశ్వర్ తో కలిసి మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ నెల 11న కాసిపేటకు చెందిన దుర్గం సందీప్(21), భీమారం మండలంలోని అంకుశాపూర్(22)కు చెందిన దుర్గం సంజయ్ మహారాష్ట్రలోని చంద్రపూర్​కు వెళ్లి కొందరి వద్ద గంజాయి కొని తీసుకొచ్చారు.

గురువారం భీమారం మండల కేంద్రం సమీపంలోని అటవీ శాఖ కలప డిపో ఎదురుగా చెన్నూర్ మండలంలోని కిష్టంపేటకు చెందిన  సింగరేణి ఉద్యోగి వనపర్తి కరుణసాగర్(28), రావుల ఆదర్శ్(23) కు గంజాయి అమ్ముతుండగా ఎస్సై శ్వేత నిబ్బందితో కలిసి వారిని పట్టుకున్నారు. ఈ నలుగురితోపాటు గంజాయి కొంటున్న భీమారం మండల కేంద్రానికి చెందిన మరో ఇద్దరు రాంటెంకి స్వస్తిక్ కుమార్(19), జునేరి శ్రీనివాస్(20)ను అదుపులోకి తీసుకున్నారు. 

వారి వద్ద నుంచి కేజీ 595 గ్రాముల గంజాయి, కేటీఎం బైక్, రూ.39,875 స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితులను కోర్టుకు తరలించారమన్నారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న ఎస్సై శ్వేత, హెడ్ కానిస్టేబుళ్లు మల్లయ్య, ముత్తయ్య, కార్తీక్, హోంగార్డులను డీసీపీ అభినందించారు.