బేడీలు వేసిన వారిలో రైతులెవరూ లేరు : భువనగిరి డీసీపీ

రైతులకు బేడీలు వేసి కోర్టుకు పోలీసులు తీసుకువచ్చారంటూ మీడియాలో వస్తున్న వార్తలపై యాద్రాది భువనగిరి డీసీపీ రాజేష్ చంద్ర స్పందించారు. సహజంగా నేరస్తుల ప్రవర్తనను బట్టి.. వారిని ఎంత బందోబస్తు నడుమ తీసుకువెళ్లాల్సి ఉంటుందో తాము నిర్ణయిస్తామని, ఆ నలుగురు గతంలో అరెస్టు సమయంలోనే పోలీసులను తోయడం, తమ వాహనాన్ని ధ్వంసం చేయడం, కలెక్టర్ ఆఫీసు లోపలికి వెళ్లి నిప్పు పెట్టి  ధ్వంసం చేయడం వంటి కారణాల వల్లే వారిని అరెస్ట్ చేశామని చెప్పారు. అరెస్టు అయిన వారిలో  రైతులు ఎవరూ లేరన్నారు. 

నలుగురిలో జమ్మాపూర్ మత్త్రేస్స్ కంపెనీలో పని చేసే వ్యక్తికి  మాత్రం 20 గుంటల భూమిని రియల్ ఎస్టేట్ కోసం ఆరుగురు వ్యక్తులతో కలిసి కొన్నాడని వివరణ డీసీపీ రాజేష్ చంద్ర ఇచ్చారు. ఆ 20 గుంటల భూమిలోనూ కొంతభూమి పోతుందని తమకు ప్రాథమిక దర్యాప్తులో తెలిసిందన్నారు. మంత్రి జగదీష్ రెడ్డి కాన్వాయ్ కు అడ్డుపడి.. దాడి చేసినందుకు నలుగురిని అరెస్ట్ చేశామన్నారు. 

రెగ్యులర్ ప్రోటోకాల్ లో భాగంగానే నలుగురిని భువనగిరి కోర్టుకు తీసుకొచ్చామన్నారు డీసీపీ రాజేష్ చంద్ర. కోర్టుకు తీసుకువచ్చే సమయంలో నలుగురు ఎస్కార్ట్ పార్టీని కూడా ఇబ్బంది పెట్టారని తమకు తెలిసిందని, అయినప్పటికీ మీడియాలో వస్తున్న వార్తల దృష్ట్యా బందోబస్తులో ఉన్న పోలీస్ ఇన్ చార్జ్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నామని వివరించారు.