Ranji Trophy: 12 ఏళ్ళ తర్వాత రంజీ ట్రోఫీ స్క్వాడ్ లో విరాట్ కోహ్లీ: కన్ఫర్మ్ చేసిన ఢిల్లీ క్రికెట్ సెక్రటరీ

టీమిండియా స్టార్ క్రికెటర్ రంజీ ట్రోఫీ ఆడడం దాదాపుగా ఖాయమైంది. చివరిసారిగా 2012 లో ఢిల్లీ తరపున రంజీ ట్రోఫీ ఆడిన కోహ్లీ.. 12 ఏళ్ళ తర్వాత ఈ ప్రతిష్టాత్మక టోర్నీ ఆడేందుకు సిద్ధమయ్యాడు. రంజీ ట్రోఫీలో భాగంగా చివరి రెండు రౌండ్‌ల కోసం ఢిల్లీ ప్రాబబుల్స్ జట్టులో విరాట్ కోహ్లి ఎంపికైనట్లు ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డిడిసిఎ) కార్యదర్శి అశోక్ శర్మ మంగళవారం(జనవరి 14) తెలిపారు.  కోహ్లీతో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఢిల్లీ స్క్వాడ్ కు ఎంపికయ్యాడు.  

అశోక్ శర్మ మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ ముంబై క్రికెటర్లను చూసి నేర్చుకోవాలని.. అతను రాబోయే రంజీ ట్రోఫీ మ్యాచ్‌కు అందుబాటులో ఉండాలని చెప్పారు. విరాట్ ముంబై క్రికెటర్లను స్పూర్తిగా తీసుకొని దేశవాళీ క్రికెట్‌లో ఢిల్లీ తరపున ఆడాలని సూచించాడు. ముంబైకి తరపున ఆడే భారత ఆటగాళ్లు ఎప్పుడూ రంజీ ట్రోఫీ మ్యాచ్ లు ఆడతారని..ఈ అలవాటు ఢిల్లీ క్రికెటర్లకు లేదని ఆయన తెలిపాడు. దేశవాళీ క్రికెట్‌లో భారత క్రికెటర్లు ఆడాలని బీసీసీఐ సూచించింది. విరాట్, రిషబ్ కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఆడతారని నేను భావిస్తున్నానాని ఆయన అన్నారు. 

ALSO READ | Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ.. ఆరు జట్ల స్క్వాడ్ వివరాలు ఇవే

కోహ్లీ టెస్ట్ ఫార్మాట్ లో పేలవ ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కోహ్లీ 9 ఇన్నింగ్స్ ల్లో కేవలం 190 పరుగులు మాత్రమే చేయడంతో ఐసీసీ ర్యాంకింగ్స్ లో 12 ఏళ్ళ తర్వాత టాప్ 25 లో చోటు కోల్పోయాడు. కోహ్లీ ఫామ్ పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఘోరంగా విఫలమవుతూ జట్టుకు భారంగా మారుతున్నాడు. విరాట్ తన పేలవ ఫామ్ ను కొనసాగిస్తే అతని టెస్ట్ క్రికెట్ కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం కనిపిస్తుంది. 

2025 డబ్ల్యూటీసీ టెస్ట్ సిరీస్ ను భారత్ జూన్ నెల నుంచి ప్రారంభించనుంది. ఇందులో భాగంగా ఇంగ్లాండ్ గడ్దపై భారత్ 5 టెస్టులు ఆడనుంది. ఈ సిరీస్ కోహ్లీ టెస్ట్ కెరీర్ కు కీలకం కానుంది. ఒకవేళ కోహ్లీ ఇంగ్లాండ్ సిరీస్ లో విఫలమైతే అతని టెస్ట్ కెరీర్ ముగిసినట్టే అని ఎక్స్ పర్ట్స్ భావిస్తున్నారు. ఈ కఠిన సవాలుకు ముందు కోహ్లీ ఇంగ్లాండ్ కౌంటీల్లో కనబడే అవకాశం ఉన్నట్టు వార్తలు వచ్చాయి. టెస్ట్ సిరీస్ జూన్ 20 నుండి హెడ్డింగ్లీలోని లీడ్స్‌లో ప్రారంభమవుతుంది. కోహితో పాటు రోహిత్ శర్మ, శుభమాన్ గిల్ రంజీ ట్రోఫీ ఆడనున్నారు.