రామప్పలో లీకేజీలకు త్వరలోనే రిపేర్లు : డీఈ చంద్రకాంత్

రామప్పలో లీకేజీలకు త్వరలోనే రిపేర్లు : డీఈ చంద్రకాంత్
  • సింగరేణి ఓపెన్​కాస్ట్​తో  ఆలయానికి ముప్పు
  •  రిటైర్డ్ ప్రొఫెసర్​ పాండురంగారావు,  కేంద్ర పురావస్తు శాఖ  డీఈ చంద్రకాంత్

వెంకటాపూర్ (రామప్ప), వెలుగు ; ములుగు జిల్లాలో యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయంలో వర్షాలకు పలుచోట్ల లీకేజీలు అవుతుండడంతో మంగళవారం కాకతీయ హెరిటేజ్ మెంబర్,​ నీట్ రిటైర్డ్ ప్రొఫెసర్ పాండురంగారావు, కేంద్ర పురావస్తు డీఈ చంద్రకాంత్ పరిశీలించారు. టెంపుల్​లోని ఉత్తర ద్వారం ఈశాన్య, ఆగ్నేయ, దక్షిణ దిశల్లో పిల్లర్ల పైనుంచి నీళ్లు కారడాన్ని చూశారు.

తర్వాత విలేకరులతో మాట్లాడుతూ భారీ వర్షాల వల్ల టెంపుల్ కుంగినప్పుడు కప్పు దూలాల మధ్యలో ఏర్పడిన సందుల్లో నుంచి నీరు కారుతోందన్నారు. త్వరలోనే నీళ్లు కారకుండా రిపేర్లు చేస్తామన్నారు. కేంద్రపురావస్తు శాఖ ఆధ్వర్యంలో గతంలో టెండర్లు పిలిచినా ఎవరూ రాలేదని, మరోసారి టెండర్లు పిలిచి మరమ్మతులు చేయిస్తామన్నారు. దీంతోపాటు సోమసూత్రం రిపేర్లు, కామటేశ్వరాలయం పునర్నిర్మాణం చేపడతామన్నారు. కోమటేశ్వరాలయ పునాదిలో సాయిల్ టెస్ట్ పనులు జరుగుతున్నాయన్నారు.  

సింగరేణితో రామప్పకు ముప్పు

సింగరేణి ఏర్పాటు చేయాలనుకుంటున్న ఓపెన్ కాస్ట్ వల్ల రామప్ప టెంపుల్, లేక్ కు ప్రమాదం పొంచి ఉందని పాండురంగారావు, చంద్రకాంత్ అన్నారు. 300 మీటర్ల లోతులో ఏర్పాటుచేసే ఓపెన్ కాస్ట్ వల్ల భూమి లోపల పొరల్లో కదలికలు ఏర్పడి ఆలయం కూలిపోయే ప్రమాదముందని, దీంతో పాటు 3 టీఎంసీల వాటర్ కెపాసిటీ కలిగిన లేక్ ఎండిపోతుందన్నారు. ఓపెన్ కాస్ట్ ఏర్పాటుకు కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వకూడదన్నారు.

ALSO READ : పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చు

చిన్న కదలికలకే టెంపుల్ కురుస్తుందని,  ఓసీపీ వల్ల టెంపుల్ పూర్తిగా దెబ్బతింటుందన్నారు. రామప్పని మరో వేయి సంవత్సరాలు కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఆలయ ఈవో బిల్లా శ్రీనివాస్, పురావస్తు శాఖ ఏఈ కృష్ణ చైతన్య, కో ఆర్డినేటర్ కుమారస్వామి, అర్చకులు ఉమాశంకర్, పురావస్తు, దేవాదాయ, టూరిజం శాఖల సిబ్బంది పాల్గొన్నారు.