IPL 2024: వ్యక్తిగత రికార్డులు తప్ప.. డివిలియర్స్ ఏం సాధించాడు: గౌతమ్ గంభీర్

IPL 2024: వ్యక్తిగత రికార్డులు తప్ప.. డివిలియర్స్ ఏం సాధించాడు: గౌతమ్ గంభీర్

ఐపీఎల్‌ 2024లో ముంబై ఇండియన్స్ ప్రదర్శన ఇద్దరు దిగ్గజ ఆటగాళ్ల మధ్య గొడవకు దారితీస్తోంది. ఐపీఎల్ టోర్నీలో ఐదు సార్లు  ఛాంపియ‌న్ అయిన ముంబై ప్రస్తుత సీజ‌న్‌లో దారుణ ప్ర‌ద‌ర్శ‌న‌లో అన్ని జ‌ట్ల కంటే ముందుగానే ప్లే ఆఫ్ రేసు నుంచి వైదొలిగింది. ఇప్పటివరకూ 13 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగంటే నాలుగు విజయాలు సాధించింది. అందునా, కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా తీసుకున్న కొన్ని తెలివి తక్కువ నిర్ణయాలు ఆ జట్టును నిండా కొంప ముంచాయి.

స్టార్‌ పేసర్‌ బుమ్రాను పక్కనబెట్టి 3 లేదా 4వ ఓవర్లో బౌలింగ్‌కు దించడం.. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో అనుభవమే లేని సౌతాఫ్రికా అండర్ 19 పేసర్‌ క్వెనా మపాకాకు ఓపెనింగ్ ఓవర్ ఇవ్వడం, ప్రత్యర్థి జట్టు బ్యాటర్లు ఎడాపెడా పరుగులు రాబడుతున్నా విఫలమైన బౌలర్‌తోనే వరుస ఓవర్లు వేయించడం వంటి పలు నిర్ణయాలు అతని కెప్టెన్సీపై విమర్శలకు దారితీశాయి. ఇటీవల ఇదే అంశాలను లేవనెత్తుతూ మాజీ క్రికెటర్లు డివిలియర్స్, ఇర్ఫాన్ పఠాన్ వంటి వారు అతన్ని విమర్శించారు. 

తాజాగా, ఈ వివాదంలోకి తలదూర్చిన భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్.. ఏబీ డివిలియర్స్‌పై విమర్శలు గుప్పించారు. వ్యక్తిగత రికార్డులు తప్ప.. ఏబీ సాధించింది ఏంటి..? అని గంభీర్ ప్రశ్నించారు.

"అతను కెప్టెన్‌గా ఉన్నప్పుడు అతని స్వంత ప్రదర్శన ఏమిటి? కెవిన్ పీటర్సన్ కావచ్చు లేదా ఏబీ డివిలియర్స్ కావచ్చు. కెప్టెన్‌గా వారు తమ కెరీర్‌లో సాధించిన గొప్ప రికార్డులు ఏంటి..? అలాంటి ప్రదర్శనలు కలిగి ఉన్నారని నేను అనుకోను. వారి రికార్డులను ఎంత క్షుణ్ణంగా పరిశీలించినా అక్కడ ఏమీ ఉండదు. డివిలియర్స్ వ్యక్తిగత స్కోర్లు కాకుండా ఐపీఎల్‌లో ఏమి సాధించాడు. జట్టు కోణంలో అతను ఎంత వరకు ఉపయోగపడ్డాడు.." అని గంభీర్ స్పోర్ట్స్‌కీడాతో వ్యాఖ్యానించాడు.

గంభీర్ వ్యాఖ్యల నేపథ్యంలో మరోసారి స్పందించిన ఏబీ.. తన వ్యాఖ్యలను మీడియా తప్పుగా ఉటంకించిందని సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశాడు.