- కువైట్ నుంచి 45 మంది మృతదేహాలను తీసుకొచ్చిన కేంద్రం
- ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ పొందుతూ మరో ఇండియన్ మృతి
న్యూఢిల్లీ : కువైట్లో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన ఇండియన్ల డెడ్ బాడీలను మన దేశానికి తీసుకొచ్చారు. ఎయిర్ ఫోర్స్ కు చెందిన ప్రత్యేక విమానంలో 45 మంది మృతదేహాలను శుక్రవారం ఇండియాకు తీసుకొచ్చారు. అగ్నిప్రమాదంలో చనిపోయిన 45 మందిలో కేరళ వాసులు 23 మంది, ఏడుగురు తమిళులు, ఏపీ వాసులు ముగ్గురు, యూపీ వాసులు ముగ్గురు, ఒడిశాకు చెందినోళ్లు ఇద్దరు, బిహార్, పంజాబ్, కర్నాటక, మహారాష్ట్ర, బెంగాల్, జార్ఖండ్, హర్యానాకు చెందినోళ్లు ఒక్కరు చొప్పున ఉన్నారు.
ప్రమాద విషయం తెలిసిన వెంటనే కువైట్ కు వెళ్లిన కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ పేపర్ వర్క్ కంప్లీట్ చేసుకుని, 45 మంది డెడ్ బాడీలను తీసుకుని ఎయిర్ ఫోర్స్ విమానంలోనే తిరిగొచ్చారు. ఈ విమానం మొదట కేరళలోని కొచ్చి ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయింది. అక్కడ కేరళ, తమిళనాడు, కర్నాటకకు చెందినోళ్ల మృతదేహాలను అప్పగించారు. అక్కడి నుంచి అంబులెన్స్ లలో సొంతూళ్లకు తరలిస్తామని అధికారులు తెలిపారు. అనంతరం ఎయిర్ ఫోర్స్ విమానం కొచ్చి నుంచి ఢిల్లీకి వచ్చింది.
మిగతా రాష్ట్రాలకు చెందినోళ్ల మృతదేహాలను ఢిల్లీ నుంచి సొంతూళ్లకు తరలిస్తున్నారు. ‘నిజానికి మృతదేహాల గుర్తింపు, పేపర్ వర్క్ కంప్లీట్ కావడానికి వారం, పది రోజులు పడుతుంది. కానీ ప్రధాని మోదీ విజ్ఞప్తితో అక్కడి అధికారులు చాలా త్వరగా ప్రక్రియను పూర్తి చేశారు” అని కేంద్రమంత్రి కీర్తివర్ధన్ సింగ్ చెప్పారు. కాగా, అగ్నిప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో ఇండియన్ ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ పొందుతూ చనిపోయాడు. దీంతో మృతుల సంఖ్య 50కి పెరగ్గా, ఇండియన్ల సంఖ్య 46కు పెరిగింది.
మాటలకందని విషాదం : కేరళ గవర్నర్
కువైట్ అగ్నిప్రమాదంపై కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ దిగ్ర్భాంతి వ్యక్తంచేశారు. ఇది మాటలకందని విషాదమని పేర్కొన్నారు. ‘మన దగ్గర ఉపాధి అవకాశాలు లేక చాలామంది గల్ఫ్ వెళ్తున్నారు. దీనిపై మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది” అని కేరళ గవర్నర్ ఆరిఫ్ చెప్పారు.