టన్నెల్​లో డెడ్​బాడీలు?..జీపీఆర్, థర్మల్​స్కానర్లతో గుర్తింపు

టన్నెల్​లో డెడ్​బాడీలు?..జీపీఆర్, థర్మల్​స్కానర్లతో గుర్తింపు
  • స్పాట్​వద్దకు చేరుకున్న డిప్యూటీ డీఎంహెచ్​వో​, ఫోరెన్సిక్ నిపుణులు
  • మట్టిని బయటకు తీసేందుకు ప్రత్యేక యంత్రాలు
  • తీవ్రంగా శ్రమిస్తున్న సింగరేణి రెస్క్యూ అండ్ మైన్స్​ ఆపరేషన్​ టీమ్

ఎస్​ఎల్​బీసీ నుంచి వెలుగు టీం: నాగర్​కర్నూల్​ జిల్లా దోమలపెంట వద్ద ఎస్ఎల్​బీసీ టన్నెల్​లో చిక్కుకున్న వారిని గుర్తించేందుకు రెస్క్యూ టీమ్స్​ పలువిధాలా గాలింపు చర్యలు చేపట్టాయి. ప్రమాదంలో గల్లంతైన ఇద్దరు ఇంజినీర్లు, ఇద్దరు ఆపరేటర్లు, నలుగురు కార్మికుల్లో కొందరు చనిపోయినట్టు తెలుస్తుండగా.. వారి డెడ్​బాడీ ఆనవాళ్లను జీపీఆర్, థర్మల్​ స్కానర్లతో శుక్రవారం గుర్తించారు. 

గల్లంతైన వారి ఆచూకీ కోసం వారం రోజులుగా రెస్క్యూ  టీమ్​లు శ్రమిస్తుండగా.. శుక్రవారం మధ్యాహ్నం ఎన్ జీఎస్ఐ, ఎన్ జీఆర్ఐ టీమ్స్​ కీలక సమాచారాన్ని సేకరించినట్లు తెలిసింది. మధ్యాహ్నం జీపీఆర్​ (గ్రాండ్​ పినట్రేటింగ్​ రాడార్), థర్మల్​ స్కానర్లతో 13.9 కిలోమీటర్​ పాయింట్​ వద్ద బురదలో స్కాన్​ చేస్తుండగా ఆ ప్రాంతంలో మనుషుల శరీర ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 8 చోట్ల సెన్సార్లు గుర్తించిన పాయింట్ల వద్ద మార్కింగ్​చేశారు. 

అక్కడ మనుషుల ఆనవాళ్లు ఎంత లోపల ఉన్నాయి? వాటిని ఎలా బయటకు తీసుకురావాలి? అని ఆఫీసర్లు చర్చలు జరుపుతున్నారు. కాగా, దీనిపై ఉన్నతాధికారులు  క్లారిటీ ఇవ్వడం లేదు. సింగరేణి సీఎండీ బలరాం మీడియాతో  మాట్లాడుతూ.. 8 మంది చిక్కుకున్న ప్రదేశాన్ని గుర్తించామని, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్​ నుంచి క్లియర్ రాడార్ పిక్చర్స్ వచ్చిన తర్వాతే నిర్ధారణ జరుగుతుందని చెప్పారు.  దీనికి మరో 2 రోజులు పడుతుందని ఆయన సమాధానం ఇచ్చారు.

టన్నెల్ లోకి యంత్రాలు

టన్నెల్​లో పేరుకుపోయిన మట్టిని బయటకు తీసేందుకు ప్రత్యేక యంత్రాలు ఉపయోగిస్తున్నారు. ఆర్మీ నుంచి బాట్​ క్యాట్​ మెషీన్​ను తెప్పించారు. దీని ద్వారా మట్టిని ఎత్తుతున్నారు.  ఫైర్​ డిపార్ట్​మెంట్​ ఆధ్వర్యంలో ఆక్వా ఐ మెషీన్​​ను తీసుకురాగా, ఇది నీటిలో మనుషుల ఆనవాళ్లను గుర్తించి, సిగ్నల్​ ఇస్తున్నది. మనిషి కాకుండా ఇతర ఏ జంతువుల కళేబరాలు ఉన్నా.. ఎలాంటి సిగ్నల్స్​ ఇవ్వదు. అలాగే 100 హెచ్ పీ మోటారు ఒకటి, 50 హార్స్​ పవర్​ ఉన్న మోటార్లు ఐదింటిని టన్నెల్​లోకి తీసుకెళ్లి వాటితో డీ వాటరింగ్​ చేస్తున్నారు. 

బురద, మట్టి, టీబీఎం శిథిలాల తొలగింపు షురూ

టన్నెల్​ వద్ద బురద, మట్టి, టీబీఎం శిథిలాల తొలగింపు అతి పెద్ద టాస్క్. వీటిలో బురద, మట్టి తరలింపు పనులు గురువారం అర్ధరాత్రి నుంచి ప్రారంభమయ్యాయి. సింగరేణి రెస్క్యూ అండ్ మైన్స్​ ఆపరేషన్​ టీమ్​ ఈ పనులు చేపడుతున్నది. గురువారం వరకు ఈ టీమ్​లో 100 మంది వరకు టన్నెల్​ వద్దకు రాగా.. శుక్రవారం మధ్యాహ్నం వరకు మరో 200 మంది వచ్చారు. 

ఈ కంపెనీ నుంచి మొత్తం 300 మంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. వీరంతా బురద, మట్టి తీసే పనిలో నిగమ్నం కానున్నారు. ట్రిప్​కు 50 మంది చొప్పున టన్నెల్​లోకి వెళ్తున్నారు. గురువారం రాత్రి 50 మంది టన్నెల్​లోకి వెళ్లి ఉదయం 11 గంటలకు తిరిగి వచ్చారు. 12వ కిలోమీటరు నుంచి పేరుకుపోయిన బురద, మట్టిని వీరు మ్యానువల్​గా పారా, తట్టలతో ఎత్తుతున్నారు. 

తీసిన మట్టిని లోకోలోకి ఎత్తి పోసి బయటకు పంపిస్తున్నారు. ఆ తర్వాత ఈ బురదను సమీపంలోని కృష్ణానదిలో పారబోస్తున్నారు. 140 మీటర్ల పొడవు, 1500 టన్నుల బరువున్న టీబీఎం శిథిలాలను శుక్రవారం ఉదయం 11.30 గంటల నుంచి కాజీపేటకు చెందిన రైల్వే సిబ్బంది ప్రత్యేక మిషన్​తో కట్​ చేస్తున్నారు. కట్​ చేసిన పైపులను మ్యానువల్​గా తరలించే అవకాశం లేకపోవడంతో అక్కడే డంప్​ చేశారు.

ఫోరెన్సిక్​ బృందానికి పిలుపు..

టన్నెల్ లోపల మృత దేహాలను గుర్తించిన రెస్క్యూ టీమ్స్​ శుక్రవారం సాయంత్రం 2 డెడ్ బాడీలను వెలికి తీసినట్టు సమాచారం. శనివారం ఉదయం వరకు మిగతా డెడ్​బాడీలను బయటకు తీసే అవకాశాలు ఉన్నాయి.  మృతదేహాల ఆనవాళ్లను గుర్తించగానే హుటాహుటిన ఫోరెన్సిక్ నిపుణుల బృందాన్ని,  నాగర్​కర్నూల్​ జిల్లా డిప్యూటీ డీఎంహెచ్​వో తారాసింగ్​ను పిలిపించారు. డీఎన్ఏ టెస్టుల అనంతరం డెడ్​బాడీలను గుర్తించి, బంధువులకు అప్పగిస్తారని సమాచారం. ఈ ప్రక్రియ పూర్తయ్యేలోగా ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన, పరిహారం చెల్లింపు అంశాలు ఉంటాయని తెలిసింది.

లోకో ట్రాక్​ను సిద్ధం చేసేందుకు..

ప్రమాద స్థలంలో 200 మీటర్ల పొడవు, 9.2 మీటర్ల ఎత్తులో బురద, మట్టి, రాళ్లు పేరుకుపోయాయి. ఇక్కడే టీబీఎం సగభాగం కూరుకుపోయింది. అయితే ఈ మట్టిని బయటకు తరలించేందుకు మ్యానువల్​గా ​సాధ్యం అయ్యే చాన్స్​ లేకపోవడంతో.. లోకోను ఇక్కడి వరకు తీసుకురావాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా 3 రోజుల కిందట యాక్సిండెంట్​ చివరి పాయింట్​ వరకు వెళ్లి వచ్చిన ఆఫీసర్లు.. ఇక్కడ మట్టిని తరలించడానికి లోకో ట్రాక్​పై ఉన్న బురదను క్లియర్ చేయడంతోపాటు కన్వేయర్​ బెల్టును అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయానికి వచ్చారు. 

ఈ క్రమంలో 12వ కిలోమీటరు నుంచి 13.5 కిలోమీటర్ల వరకు పేరుకుపోయిన ఒక మీటరున్నర మట్టిని ఎత్తి పోస్తున్నారు. ఆ తర్వాత లోకోను 13.5 కిలోమీటరు వరకు తీసుకొచ్చి మట్టిని దాని ద్వారా బయటకు తరలించడానికి ప్లాన్​ చేస్తున్నారు.