మోరంచవాగుకు 10 కి.మీ దూరంలో తేలిన శవాలు

  • డ్రోన్లతో వెతికిన పోలీసులు
  • దొరికిన నలుగురి డెడ్​బాడీలు 

జయశంకర్ ​భూపాలపల్లి, వెలుగు : మోరంచవాగు ఉధృతికి బుధవారం అర్ధరాత్రి గల్లంతైన నలుగురిలో  ఇద్దరి శవాలను శనివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భార్యాభర్తలైన గొర్రె ఓదిరెడ్డి, గొర్రె వజ్రమ్మతో పాటు గంగిడి సరోజన, గడ్డం మహాలక్ష్మి వరదలో కొట్టుకుపోయారు. వీరిలో ఓదిరెడ్డి ఇంటి నుంచి 10 కి.మీ దూరం కొట్టుకుకుపోయి చిట్యాల మండలం పాశిగడ్డ తండా శివారులో శవమై తేలాడు. గంగిడి సరోజన మృతదేహం సోలిపేట తాళ్లవద్ద కనిపించింది. శనివారం భూపాలపల్లి, చిట్యాల పోలీసులు కలిసి డ్రోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కెమెరా సాయంతో మోరంచవాగు పొడవున వెతకడంతో డెడ్​బాడీలు దొరికాయి. వజ్రమ్మ, మహాలక్ష్మి ఆచూకీ లభ్యం కాలేదు. శవాలు కుళ్లిపోవడంతో మోయడానికి ఎవరూ రాకపోతే  పోలీసులే కర్రకు కట్టుకొని భుజాలపై మోసుకుని ఒడ్డుకు తీసుకువచ్చారు.  

దొరికిన నందయ్య డెడ్​బాడీ  
తాడ్వాయి : ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని జంపన్న వాగులో మూడు రోజుల క్రితం కొట్టుకుపోయిన గోనెపల్లికి చెందిన గుత్తి కోయ  బాడిషా నందయ్య (55) డెడ్​బాడీ శనివారం గ్రామస్తులకు జంపన్న వాగు సమీపంలో ఇసుక  మేటలపై కనిపించింది. నందయ్య కొంతకాలంగా మేడారానికి చెందిన బిజ్జా బాగవయ్య మామిడి తోటకు కాపలాదారుగా ఉంటున్నాడు. బుధవారం జంపన్న వాగు ఉప్పొంగడంతో కొట్టుకుపోయాడు. అప్పటి నుంచి అతడి కోసం గాలిస్తుండగా శనివారం మృతదేహం దొరికింది. నందయ్యకు ఇద్దరు బిడ్డలు ఉన్నారు.