ఎంజీఎంలో డెడ్​బాడీ మార్చేసిన్రు

వరంగల్​ సిటీ, వెలుగు: కరోనాతో మృతిచెందిన వృద్ధురాలికి బదులుగా మరో వ్యక్తి మృతదేహాన్ని అప్పగించిన ఘటన ఎంజీఎంలో చోటుచేసుకుంది. ఎల్కత్తురి మండలం దామెర గ్రామానికి చెందిన పండుగ కొమురమ్మ(65)కు కరోనా సోకడంతో చికిత్స కోసం వరంగల్​ఎంజీఎంలో చేరింది. పరిస్థితి విషమించడంతో చనిపోయింది. కొమురమ్మ మృతదేహాన్ని ఎంజీఎం హాస్పిటల్​ సిబ్బంది బంధువులకు అప్పగించడంతో అంబులెన్స్ లో గ్రామానికి తీసుకెళ్లారు. అంత్యక్రియలు చేసే టైంలో చూడగా కొమురమ్మకు బదులుగా మరో వ్యక్తి మృతదేహం కనిపించింది. ఆందోళన చెందిన కుటుంబసభ్యులు అదే అంబులెన్స్ లో మృతదేహాన్ని ఎంజీఎం హాస్పిటల్​కు తీసుకెళ్లారు. డాక్టర్ల నిర్లక్ష్యంపై మండిపడ్డారు.  కొమురమ్మకు బదులుగా కొమురయ్య అనే వ్యక్తి మృతదేహం ఇచ్చినట్లు తేలింది. అనంతరం కొమురమ్మ మృతదేహం ఇవ్వడంతో గ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశారు.