ప్రముఖ మలయాళ నటుడు వినోద్ థామస్(Vinod thomas) (47) కన్నుమూశారు. మళయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోషియుమ్ లో ప్రత్యేక పాత్రలో కనిపించిన ఈ నటుడు తన కారులో శవమై కనిపించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. నవంబర్ 18 శనివారం రాత్రి కేరళలోని కొట్టాయం జిల్లా బంబడి ప్రాంతంలోని ఓక హోటల్ పార్కింగ్ వద్ద అనుమానాస్పదంగా ఒక కారు ఆగి ఉంది. అది గమనించిన హోటల్ సిబ్బంది.. కారు డోర్ ఓపెన్ చేసి చూడగా.. అందులో వినోద్ థామస్ మృత దేహం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
హోటల్ సిబ్బంది పిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. మృతదేహాన్ని పరిశీలించి దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ప్రాథమిక విచారణ చేపట్టిన పోలీసుల.. అది మలయాళ నటుడు వినోద్ థామస్ అని నిర్దారణకు వచ్చారు కానీ.. ఆయన మరణానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. ఇక నటుడు వినోద్ థామస్ మరణవార్తతో మలయాళ చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతిపట్ల ఇండస్ట్రీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.