
మమత, గంగాధర్ కుటుంబాలకు న్యాయం చేయాలంటూ డిమాండ్
న్యావనందిలో టెన్షన్.. టెన్షన్
నిజామాబాద్/నిజామాబాద్క్రైం, వెలుగు: నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది గ్రామంలో ఆదివారం చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న తర్ర గంగాధర్ డెడ్ బాడీని గ్రామస్థులు సోమవారం రాత్రి వరకూ చెట్టు నుంచి కిందకు దించలేదు. మూడు నెలల క్రితం దారుణ హత్యకు గురైన పుర్రె మమత హత్య కేసులో గంగాధర్ ను పోలీసులు అనుమానించారు. ఈ నేపథ్యంలో అతను సూసైడ్చేసుకున్నాడు. పుర్రె మమత హత్య కేసులో అమాయకులను వేధించడం మానుకుని, అసలైన నిందితులను పట్టుకుని శిక్షించాలంటూ పుర్రె మమత, తర్ర గంగాధర్ కుటుంబీకులు, బంధువులు రెండు రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు, నిజామాబాద్‌అర్బన్ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ సోమవారం ఉదయాన్నే న్యావనందికి చేరుకుని బాధితుల ఆందోళనకు మద్దతు పలికారు. ఘటన స్థలంలో బైఠాయించి న్యాయం కోసం డిమాండ్ చేశారు. మమత హత్య కేసులో అసలైన నిందితులను పట్టుకుని శిక్షించాలని తాము డిమాండ్ చేస్తే అమాయకుడిని కేసులో ఇరికించేందుకు పోలీసులు ప్రయత్నించారని ఆరోపించారు.
గ్రామస్థులతో ఆర్డీవో చర్చలు
నిజామాబాద్ ఆర్డీవో రవికుమార్, సిరికొండ తహసీల్దార్ అనిల్ కుమార్ సోమవారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో గ్రామానికి చేరుకున్నారు. గ్రామస్థులతో మాట్లాడి డెడ్‍బాడీని చెట్టు పైనుంచి దించేందుకు ఒప్పించే ప్రయత్నం చేశారు. చేయని నేరం ఒప్పుకుంటే సుమారు రూ.8 లక్షలు చెల్లిస్తామని పోలీసులు అన్నారంటూ తండ్రి తనతో చెప్పాడని గంగాధర్ కొడుకు చరణ్ ఆర్డీవో, తహసీల్దార్లతో పేర్కొన్నారు. అధికారులు ఎన్ని రకాలుగా చెప్పినా గ్రామస్థులు వినిపించుకోలేదు. పుర్రె మమత, తర్ర గంగాధర్ కుటుంబాలకు ప్రభుత్వం నుంచి రూ. 25 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, తర్ర గంగాధర్‍ను వేధించి అతడి చావుకు కారణమైన ధర్‍పల్లి సీఐ, సిరికొండ ఎస్సైలను వెంటనే సస్పెండ్ చేసి వారిపై కేసులు నమోదు చేయాలని, పుర్రె మమత హత్య కేసులో అసలు నిందితులను పట్టుకుని శిక్షించి, న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. గ్రామస్థుల డిమాండ్లు పరిష్కరించడం తన పరిధిలో లేదని కలెక్టర్ దృష్టికి తీసుకెళతానని ఆర్డీవో అన్నారు. జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డితో ఫోన్‍లో మాట్లాడి గ్రామస్థుల డిమాండ్లను వివరించారు. కొంతమంది కలిసి తన వద్దకు వస్తే అన్ని విషయాలు మాట్లాడి తగిన న్యాయం చేస్తానని కలెక్టర్చెప్పినా గ్రామస్థులు వినిపించుకోలేదు. డెడ్ బాడీని దించి అన్ని కార్యక్రమాలు పూర్తి చేశాక తమ డిమాండ్లు పరిష్కరిస్తారనే నమ్మకం లేదని మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. కలెక్టర్ స్వయంగా వచ్చి హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆర్డీవో ఉదయం నుంచి రాత్రి 7 గంటల దాకా ఘటన స్థలంలోనే ఉండి పలుసార్లు చర్చలు జరిపినా గ్రామస్థులు వినిపించుకోలేదు. దీంతో అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
విచారణకు స్పెషల్ టీమ్
పుర్రె మమత కేసు దర్యాప్తు కోసం స్పెషల్ టీమ్ ఏర్పాటు చేస్తూ నిజామాబాద్ రేంజ్ ఐజీ శివశంకర్ రెడ్డి సోమవారం ఆదేశాలు జారీ చేశారు. అడిషనల్ డీసీపీ ఉషా విశ్వనాథ్, ఏసీపీ జి.శ్రీనివాస్, సీసీఎస్ ఏసీపీ టి.స్వామి, సంగారెడ్డి సీఐ శివకుమార్, దర్పల్లి సీఐ ప్రసాద్ స్పెషల్ టీమ్‌లో ఉన్నారు.