
విష జ్వరాలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. ఇప్పటికే పలువురు విషజ్వరాల బారినపడి మృతి చెందుతున్నారు. డెంగ్యూ ఫీవర్ బారినపడి పలువురు మృతి చెందుతున్న ఆస్పత్రి సిబ్బందిమాత్రం అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. మృతదేహాలను ఇంటికి తరలించేందుకు అంబులెన్స్‌లు ఇవ్వకుండా అమానవీయంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి ఏపీలో వెలుగులోకి వచ్చింది. డెంగ్యూ ఫీవర్ కొడుకును మింగేసింది. కొడుకును బతికించుకునేందుకు తల్లిదండ్రులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ కన్నబిడ్డ కన్నుమూశాడు. మృతదేహాన్ని ఇంటికి తరలించేందుకు అంబులెన్స్ ఇవ్వాలని ఆస్పత్రి సిబ్బందిని కోరగా... అంబులెన్స్ లేదని వెళ్లిపోమన్నారు. దీంతో కొడుకు మృతదేహాన్ని బైక్‌పై స్వగ్రామానికి తరలించారు. కొడుకు మృతదేహాన్ని బైక్‌పై తరలిస్తూ ఆతల్లిదండ్రులు అనుభవించిన నరకయాతన అంతా ఇంతాకాదు. ఈ అమానుష ఘటన శ్రీసత్యసాయి జిల్లాలో జరిగింది.
మడకశిర నియోజకవర్గ పరిధిలోని అమరాపురం మండలం, హనుమంతనపల్లి గ్రామంలో నివసిస్తున్న రాధమ్మ పాత లింగప్ప కుమారుడు రుషి (5) విష జ్వరంతో బాధపడుతూ మడకశిర ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం (అక్టోబర్ 17) మృతి చెందాడు. బాలుడు రుషి మృతదేహాన్ని తరలించేందుకు ఆసుపత్రి సిబ్బంది అంబులెన్సు ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు కోరారు. అందుకు ఆస్పత్రి సిబ్బంది నిరాకరించడంతో రుషి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు బైక్‌పై స్వగ్రామానికి తరలించారు. ఈ ఘటన అందర్నీ కలచివేసింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. బైక్‌పై కొడుకు మృతదేహాన్ని తరలిస్తున్నప్పుడు ఆ తల్లిదండ్రులు ఎంతలా తల్లడిల్లిపోయారోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Heartbreaking journey home carrying dead body of their 5-year-old son on motorbike from #Madakasira government hospital in #SriSathyaSaiDistrict #AndhraPradesh; ambulance was reportedly not available @ndtv @ndtvindia pic.twitter.com/cBnmRukAnn
— Uma Sudhir (@umasudhir) October 17, 2023
మడకశిర నియోజకవర్గంలో విష జ్వరాలు పెరుగుతున్నాయని, సరైన వైద్యం సామాన్యులకు అందడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నత అధికారులు స్పందించి నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో విష జ్వరాలకు మెరుగైన చికిత్స అందించేలా చర్యలు చేపట్టాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.