హైదరాబాద్ పబ్లిక్కు అలర్ట్.. జంట నగరాలకు తాగు నీళ్లిచ్చే రిజర్వాయర్లో.. చచ్చిపడి ఉన్న బర్డ్ ఫ్లూ కోళ్లు..!

హైదరాబాద్ పబ్లిక్కు అలర్ట్.. జంట నగరాలకు తాగు నీళ్లిచ్చే రిజర్వాయర్లో.. చచ్చిపడి ఉన్న బర్డ్ ఫ్లూ కోళ్లు..!

నల్గొండ జిల్లా: హైదరాబాద్ తాగు నీటి కోసం ఉపయోగించే అక్కంపల్లి రిజర్వాయర్లో బర్డ్ ఫ్లూతో మృతి చెందిన వందలాది కోళ్లను పడేశారు. అక్కంపల్లి రిజర్వాయర్ నుంచి హైదరాబాద్ జంట నగరాలకు, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని గ్రామాలకు తాగునీటిని సరఫరా చేస్తుంటారు. అలాంటి రిజర్వాయర్లో చనిపోయిన కోళ్లు, వాటి వ్యర్ధాలు వేశారనే నేపథ్యంలో రిజర్వాయర్ను ఇరిగేషన్ అధికారులతో కలిసి దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి పరిశీలించారు. 

పీఏ పల్లి మండలంలోని అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో 80 కోళ్లు మృతి చెంది కనిపించాయి. రిజర్వాయర్లో చనిపోయిన కోళ్లు ఇంకా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. సెర్చ్ చేయాలని అధికారులకు దేవరకొండ ఆర్డిఓ రమణా రెడ్డి సూచించారు. కోళ్లను ఎవరు వేశారు అనే కోణంలో విచారణ చేపట్టి కేసు నమోదు చేయాలని గుడిపల్లి పోలీసులను ఆర్డీఓ ఆదేశించారు.

ఏపీలో బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కావడంతో సరిహద్దు జిల్లాల్లో ఇప్పటికే టెన్షన్​ నెలకొంది. ప్రభుత్వ ఆదేశాలతో ఏపీని ఆనుకొని ఉన్న ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల అధికారులు అప్రమత్తమయ్యారు. సరిహద్దుల్లో 24 చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. అక్కడ పశు సంవర్థక శాఖ సిబ్బందిని నియమించారు. వాహనాలను తనిఖీ చేసిన అనంతరం రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు. ప్రత్యేకించి కోళ్లు, కోడి గుడ్లు, కోళ్ల దాణా ఏపీ నుంచి మన రాష్ట్రంలోకి రాకుండా చర్యలు తీసుకుంటున్నారు.

ALSO READ | రెండేళ్లలో ఇంటిగ్రేటేడ్ స్కూల్స్ పూర్తి చేయాలి: సీఎం రేవంత్ ఆదేశం

కోళ్లు, గుడ్లు, దాణాతో ఏవైనా వాహనాలు వస్తే వాటిని తిప్పి పంపిస్తున్నారు.  నల్గొండ జిల్లాల్లో వందల సంఖ్యలో చికెన్​షాపులున్నాయి. వాటికి అవసరమైన కోళ్లు, కోడి గుడ్లు, దాణాను వ్యాపారులు ఏపీ నుంచే తీసుకువస్తారు. అలా తీసుకొచ్చిన కోళ్లు బర్డ్ ఫ్లూ సోకి చనిపోయి ఉంటాయని, వాటిని అక్కంపల్లి రిజర్వాయర్లో వేసి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.