కేబుల్ బ్రిడ్జికి మరో డెడ్‌లైన్​..... ఈసారైనా ఓపెనింగ్ అవుతుందో లేదోనన్న డైలమా

  • ఈ నెల 8, 9 తేదీల్లో ప్రారంభోత్సవానికి మరో ముహూర్తం
  •        పూర్తి కావొచ్చిన అప్రోచ్ రోడ్డు పనులు
  •        ఈసారైనా ఓపెనింగ్ అవుతుందో  లేదోనన్న  డైలమా 
  •        ఇప్పటికే  రెండుసార్లు వాయిదా పడిన ఓపెనింగ్​

కరీంనగర్, వెలుగు:  కరీంనగర్ సిటీలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జి ఓపెనింగ్‌కు డెడ్ లైన్ల మీద డెడ్ లైన్లు పెడుతున్నారు. అయినా పనులు మాత్రం పూర్తవడం లేదు.  4 నెలలుగా సాగుతున్న అప్రోచ్ రోడ్డు పనులు ఎట్టకేలకు తుది దశకు చేరుకున్నాయి.  సీఎం కేసీఆర్ లేదా మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా కేబుల్ బ్రిడ్జిని ప్రారంభించాలని మంత్రి గంగుల భావిస్తున్నారు. వారు ఓకే చెప్తే ఈ నెల 8, 9 తేదీల్లో కేబుల్ బ్రిడ్జిని ప్రారంభించాలన్న ఆలోచనలో మంత్రి ఉన్నారు. 

ఇప్పటికే  కేబుల్ బ్రిడ్జిని ఓపెన్ చేసేందుకు గతంలో జనవరి 26న ఒకసారి, ఏప్రిల్ 14న మరోసారి డేట్ ఫిక్స్ చేసినా అది సాధ్యం కాలేదు. దీంతో ఈసారైనా కేబుల్ బ్రిడ్జి ప్రారంభమవుతుందో లేదోనన్న డైలమా నెలకొంది. అయితే బ్రిడ్జిని ప్రారంభించక పోయినా ఇప్పటికే షూటింగ్ స్పాట్ గా మారింది. ఇటీవల ఓ సినిమా యూనిట్ షూటింగ్ చేయడం విశేషం.  అటువైపుగా వెళ్తున్న వాహనదారులు కూడా ఆగి సెల్ఫీలు కూడా తీసుకుంటున్నారు. 

రూ.180 కోట్లతో కేబుల్ బ్రిడ్జి 

ఫోర్ లైన్స్​తో అర కిలోమీటర్ పొడవైన రోడ్డు, 26మీ. పొడవైన స్టీల్ కేబుల్స్‌తో రూ.180 కోట్లతో మోడ్రన్​టెక్నాలజీతో  కేబుల్ బ్రిడ్జిని నిర్మించారు. ఇందులో- రూ.8 కోట్లతో కొరియా డైనమిక్ లైటింగ్ సిస్టమ్‌ను  ఏర్పాటు చేశారు.- 2018 ఫిబ్రవరిలో ప్రారంభమైన పనులు ఐదేళ్లుగా సాగుతున్నాయి.  బ్రిడ్జి పనులు పూర్తయ్యాక ఇంజనీరింగ్ ఆఫీసర్లు నిరుడు జూన్‌లోనే లోడింగ్ టెస్టులు కూడా పూర్తి చేశారు. ఈ బ్రిడ్జి మీదుగా వరంగల్‌– కరీంనగర్ నగరాల మధ్య దూరం  సుమారు 7 కిలోమీటర్లు మేర తగ్గనుంది. 

కేబుల్ బ్రిడ్జితో మానేరు నదికి మరింత అందం చేకూరేలా, నగరవాసులకు ఆహ్లాదం పంచేలా రూ.410 కోట్లతో మానేరు రివర్ ఫ్రంట్ పనులు చేపట్టారు. ఈ పనులను ఆగస్టు 15 నాటికి పూర్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. ప్రస్తుతం కేబుల్ బ్రిడ్జి నుంచి అలగనూరు బ్రిడ్జి వరకు మధ్య మానేరుకు రెండు వైపులా రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు, నదిలో బోటింగ్ కు ఇబ్బంది లేకుండా బండరాళ్లను తొలగించే పనులు జరుగుతున్నాయి. 

గ్రాండ్‌ ఓపెనింగ్‌కు ప్లాన్​

కేబుల్ బ్రిడ్జిని ఓపెనింగ్‌ను గ్రాండ్‌గా నిర్వహించాలనుకున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. రెండు రోజులపాటు జరిపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక రోజంతా  కళాకారులు, కళారూపాలు, ప్రదర్శనలతో కల్చరల్ ఫెస్ట్ తోపాటు ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించాలని, మరో రోజు ఓపెనింగ్ కార్యక్రమం నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.