స్నేహితులతో కలిసి ఫాం హౌజ్కి వెళ్లిన వ్యక్తి స్విమ్మింగ్ పూల్లో అనుమానస్పద స్థితిలో మృతి చెందిన ఘటన మేడ్చల్ జిల్లాలో జరిగింది. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని యాదగిరిపల్లిలో ఓ ఫాం హౌజ్ ఉంది. ఈ ఫాం హౌజ్లో వీకెండ్ ఎంజాయ్ చేయడానికి శనివారం సాయంత్రం ఆరుగురు స్నేహితులు వెళ్లారు. వీరిలో సందీప్ రెడ్డి అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రాత్రి స్నేహితులంతా కలిసి మద్యం సేవించారు. స్వి్మ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేశారు.
ఏం జరిగిందో తెలియదు తెల్లవారుజామున అదే స్విమ్మింగ్ పూల్లో సందీప్ రెడ్డి శవమై కనిపించాడు. స్విమ్మింగ్ పూల్లో పడిన సందీప్ రెడ్డిని చీర్యాల్లోని విజయ్ హాస్పిటల్కు స్నేహితులు తరలించారు. అప్పటికే సందీప్ రెడ్డి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
ఫాం హౌజ్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని స్థానికుల సమాచారం. ఈ ఘటన జరిగిన విషయం తెలిసి పోలీసులు స్పాట్కు చేరుకున్నారు. సందీప్ రెడ్డి ఎలా చనిపోయాడనే విషయంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. సందీప్ రెడ్డి మృత దేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
సిద్ధార్థ్ రెడ్డి ఫాం హౌజ్లోని స్విమ్మింగ్ పూల్లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై ఫాం హౌజ్ వాచ్మెన్ మాట్లాడుతూ.. ఉదయం 6 గంటలకు వాచ్మెన్ స్విమ్మింగ్ పూల్లో కెమికల్ వేసినప్పుడు ఎవరూ లేరని, మళ్ళీ 7 గంటలకు చూస్తే స్విమ్మింగ్ పూల్లో సందీప్ రెడ్డి పడి ఉన్నాడని చెప్పాడు.