- మున్సిపల్ ఆస్తి పన్నుల వసూళ్లకు ఈనెలాఖరు డెడ్ లైన్
- 100 శాతం వసూళ్ల పై ఆఫీసర్ల నజర్
- వడ్డీపై 90 శాతం రాయితీ చాన్స్
- టార్గెట్ చేరడం కష్టమే!
జనగామ, వెలుగు : జనగామ మున్సిపల్ ఆస్తి పన్నుల వసూళ్ల పై ఆఫీసర్లు నజర్ పెట్టారు. వడ్డీ పై 90 శాతం రాయితీకి ఈనెలాఖరు వరకు మాత్రమే గడువు ఉండడంతో 100 శాతం వసూళ్లు జరిగేలా శ్రమిస్తున్నారు. మున్సిపల్ సిబ్బంది ఇండ్లకు చేరుకుని టాక్స్ పేమెంట్ చేయాలని కోరుతున్నారు. 2023-–24 యేడాది టాక్స్ టార్గెట్ రూ 5 కోట్ల 17 లక్షలు ఉండగా ఇప్పటి వరకు 64 శాతం మాత్రమే వసూళ్లు చేశారు. మిగిలిన టార్గెట్ రీచ్ అయ్యేందుకు కసరత్తు చేస్తున్నారు.
మొండి బకాయిలపై దృష్టి
మున్సిపల్ ఆదాయ వనరుల్లో పన్నుల వసూళ్లే కీలకంగా ఉన్నాయి. కానీ పట్టణ వాసుల్లో పలువురు తమ పన్నుల చెల్లింపులో ప్రతీ యేటా నిర్లక్ష్యం చేయడం ఆనవాయితీగా వస్తోంది. బకాయిల వసూళ్ల పై మున్సిపల్ స్టాఫ్ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇటీవల ఓ అడ్తి వ్యాపారి నుంచి గతేడాది బకాయితో పాటు ప్రస్తుత బకాయి కలిపి రూ 2, 68,073 లను వసూలు చేశారు.
అదే విధంగా పట్టణానికి చెందిన ఓ ప్రముఖ లీడర్ వ్యాపార సముదాయం నుంచి రూ 1,09,134 లను, ఓ విద్యా సంస్థ నుంచి 64,480లను వసూలు చేశారు. వీటితో పాటు ఆర్టీసీ పెండింగ్ బకాయిలుగా ఉన్న రూ 3 లక్షల పై చిలుకు మొత్తాన్ని వసూలు చేశారు. వీటితో పాటుగా పెద్ద పద్దుల వసూళ్లకు సంబంధించి సదరు వ్యాపారులతో వడ్డీ రాయితీ పై ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నారు.
మిగిలింది పది రోజులే
జనగామ మున్సిపల్ పరిధిలో లక్ష జనాభా దాటింది. కాలనీలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో కొంత కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలంటే మున్సిపల్ ఆదాయం పెరగాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో దుకాణాలకు ట్రేడ్ లైసెన్స్లు జారీ చేయడం లేదన్న అపవాదు ఉంది. కనీసం పన్నుల వసూళ్లు ప్రణాళికా బద్ధంగా చేపట్టాలని ప్రతీ కౌన్సిల్ మీటింగ్ లో సభ్యులు తమ గళాన్ని వినిపిస్తూ వస్తున్నారు. అయినా ప్రతీ యేటా బకాయిలు ఉండడం కామన్ గా మారింది.
ఇదే క్రమంలో 2023-24 టార్గెట్ రూ 5 కోట్ల 18 లక్షలు ఉండగా ఇందులో 2022-23కు సంబంధించిన పాత బకాయిలు రూ 2 కోట్ల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. వడ్డీ పై 90 శాతం రాయితీ ప్రకటించి స్పెషల్ డ్రైవ్ చేపడుతుండడంతో వసూళ్లు జరుగుతున్నాయి. వడ్డీ పై 90 శాతం రాయితీ తీసేస్తే రూ 4 కోట్ల 54 లక్షలు వసూలు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు రూ 2 కోట్ల 93 లక్షలు వసూలు ఆయ్యాయి. మున్సిపల్ పరిధిలో మొత్తంగా పన్నులు వసూళ్లు చేసేందుకు 14,708 కమర్షియల్, మిక్స్డ్ కమర్షియల్, రెసిడెన్స్ ఆస్థులు ఉన్నాయి.
వీటిలో కమర్షియల్ 1010, మిక్స్డ్ కమర్షియల్ 1644, ఇండ్లు 12,054 గా ఉన్నాయి. వీటితో పాటు 7935 నల్లా కనెక్షన్లు ఉండగా ప్రతీ నెల పన్నులు వసూళ్లు జరుగాల్సి ఉంది. కానీ ప్రతీ యేడాది మార్చిలోనే వసూళ్ల పై ఫోకస్ ఉంటోంది. మిగతా నెలల్లో నామమాత్రంగా వసూళ్లు జరుగుతున్నాయి. దీంతో 100 శాతం వసూళ్ల టార్గెట్ రీచ్ కావడం కష్టంగా మారింది. ఈ సారైనా లక్ష్యం చేరుతారా లేదా అనేది మరో పది రోజుల్లో తేలనుంది.
వసూళ్ల పై ప్రత్యేక దృష్టి
ఆస్థి పన్నుల వసూళ్ల పై ప్రత్యేక దృష్టి పెట్టాం. వడ్డీ పై 90 శాతం రాయితీకి ఈ నెలాఖరు వరకు గడువు ఉంది. ఇప్పటి వరకు 64 శాతం పన్నుల ను వసూలు చేశాం. బకాయిల చెల్లింపు పై పట్టణ వాసులకు అవగాహన కల్పిస్తున్నం. వడ్డీ రాయితీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇండ్లు, కమర్షియల్ కాంప్లెక్స్ ల వద్దకు వచ్చే మున్సిపల్ సిబ్బందికి సహకరించి పన్నులు చెల్లించాలి. మున్సిపల్ పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టాలంటే నిధులు అవసరం. పన్నులు సకాలంలో చెల్లిస్తే వసతుల కల్పినకు ఇబ్బంది ఉండదు. పట్టణ వాసులు వెంటనే తమ బకాయిలను చెల్లించాలి.
పీ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్, జనగామ