
- మరో మూడు నెలలు పొడిగిస్తూ సర్కార్ జీవో జారీ
హైదరాబాద్, వెలుగు: గతంలో వేలం వేసిన వడ్లను బిడ్డర్లు మిల్లర్ల నుంచి సేకరించేందుకు మరో మూడు నెలలు గడువు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సివిల్ సప్లయ్స్ కమిషనర్ మంగళవారం జీవో జారీ చేశారు. 2022– 23 యాసంగిలో సేకరించిన ధాన్యంలో 35 లక్షల ధాన్యాన్ని వేలం వేసింది.
గత బీఆర్‌ఎస్ సర్కారు హయాంలో ఎలాంటి పూచికత్తు లేకుండా మిల్లర్ల వద్ద ఈ వడ్లను నిల్వ చేసింది. ఇందులో నుంచి కొత్త సర్కారు 35 లక్షల టన్నులను వేలం ద్వారా విక్రయించింది. అయితే, అప్పటికే మిల్లర్లు తమ దగ్గర నిల్వ చేసిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి అమ్ముకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. మిల్లర్లు ఆ ధాన్యాన్ని బిడ్డింగ్ దక్కించుకున్న బిడ్డర్లకు ఇవ్వాల్సి ఉన్నా.. ఇంతవరకు ఇవ్వలేదు.
తాజాగా కేబినెట్ సబ్-కమిటీ, అంతర్గత అధికారుల కమిటీ సిఫార్సుల మేరకు ధాన్యం సేకరణకు మరో మూడు నెలలు గడువును పొడిగించింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, ఈ పొడిగించిన కాలంలో బిడ్డర్లు జరిమానాలు లేకుండా వేలం వేసిన ధాన్యాన్ని లిఫ్టు చేసుకోవచ్చు.
అలాగే, వడ్లు అమ్ముకున్న మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకొని, ధాన్యం రికవరీ చేస్తామని అధికారులు వెల్లడించారు. ఈ పొడిగింపు బిడ్డర్లు, మిల్లర్లకు ఉపశమనం కలిగిస్తుందని, అక్రమాలను నివారించి, సజావుగా ధాన్యం సేకరణ జరుగుతుందని సివిల్ సప్లయ్స్ శాఖ భావిస్తున్నది.