పహల్గాం ఎఫెక్ట్.. 537 మంది వెళ్లిపోయిన్రు.. 850 మంది వచ్చిన్రు

పహల్గాం ఎఫెక్ట్.. 537 మంది వెళ్లిపోయిన్రు.. 850 మంది వచ్చిన్రు

న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్‎లో టెర్రర్ దాడి నేపథ్యంలో పాకిస్తాన్ పౌరుల వీసాలను కేంద్రం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 27 లోగా దేశం విడిచి వెళ్లాలంటూ ఆదేశించింది. మొత్తం 12 కేటగిరీల షార్ట్ టర్మ్ వీసా హోల్డర్లకు నోటీసులు జారీ చేశామని, వీరందరికీ గడువు ముగిసిందని అధికారులు వెల్లడించారు. గత నాలుగు రోజుల్లో మొత్తం 537 మంది పాక్ పౌరులు అటారీ వాఘా బార్డర్ గుండా తమ దేశానికి వెళ్లిపోయారని తెలిపారు. 

కొందరు విమానాల్లో వేరే దేశాల మీదుగా వెళ్లినట్టు చెప్పారు. ఇక పాకిస్తాన్ నుంచి 14 మంది డిప్లమాట్స్ సహా 850 మంది భారతీయులు వాఘా బార్డర్ దాటి మన దేశానికి చేరుకున్నారని చెప్పారు. కాగా, మెడికల్ వీసాలపై వచ్చిన పాక్ పౌరులకు మాత్రం దేశం విడిచి వెళ్లేందుకు ఈ నెల 29 వరకూ గడువు ఉంది. అయితే, దేశవ్యాప్తంగా ఇప్పటికీ వేలాది మంది పాకిస్తానీయులు ఉన్నారు.

మధ్యప్రదేశ్ లో 228 మంది.. 

మధ్యప్రదేశ్​లో 228 మంది పాక్ పౌరులు ఉండగా, వీరిలో చాలా మంది ఇప్పటికే దేశం విడిచి వెళ్లారని అధికారులు చెప్పారు. కేరళలో 104 మంది పాకిస్తానీయులు ఉండగా, వారిలో 99 మంది లాంగ్ టర్మ్ వీసాలపై వచ్చారని, మిగతా ఐదుగురు టూరిస్ట్, మెడికల్ వీసాలపై ఉన్నారని అక్కడి ఆఫీసర్లు తెలిపారు. ఇక గుజరాత్ లో 438 మంది లాంగ్ టర్మ్ వీసాలతో ఉండగా, ఏడుగురు షార్ట్ టర్మ్ వీసాలతో ఉన్నారు. 

తెలంగాణలో 208 మంది పాకిస్తాన్ పౌరులు ఉండగా, వీరిలో 156 మంది లాంగ్ టర్మ్ వీసాలతో, 13 మంది షార్ట్ టర్మ్ వీసాలతో, 39 మంది మెడికల్, బిజినెస్ వీసాలపై వచ్చారు. ఒడిశాలో 12 మంది పాకిస్తానీయులు ఉండగా, డెడ్ లైన్ లోపు తిరిగి వెళ్లిపోవాలని నోటీసులు ఇచ్చారు. గోవాలో ముగ్గురికి నోటీసులు అందాయి. యూపీలోని పాకిస్తాన్ పౌరులందరినీ పంపించేశామని తెలిపారు.

ఢిల్లీలో 5 వేల మంది..

దేశ రాజధాని ఢిల్లీలో దాదాపు 5 వేల మంది పాక్ పౌరులు ఉన్నారని ఇంటెలిజెనస్ బ్యూరో(ఐబీ) అధికారులు గుర్తించారు. వీరందరికీ దేశాన్ని విడిచి వెళ్లాలని నోటీసులు జారీ చేసినట్టు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.