వరంగల్/హనుమకొండ/భూపాలపల్లి అర్బన్/ జనగామఅర్బన్/ములుగు, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు బుధవారంతో ముగిసింది. టికెట్ రాలేదన్న అసంతృప్తితో నామినేషన్లు వేసిన పలువురు లీడర్లు ‘పెద్దల’ బుజ్జగింపులు, హామీలతో తమ నామినేషన్లను వెనక్కి తీసుకున్నారు. వీరితో పాటు కొందరు ఇండిపెండెంట్లు సైతం తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.
- వరంగల్ తూర్పు నియోజకవర్గంలో 31 మంది నామినేషన్లు వాలీడ్ కాగా ఇందులో ఇద్దరు తమ నామినేషన్లను విత్‌డ్రా చేసుకున్నారు. బీఆర్‌ఎస్ రెబల్ క్యాండిడేట్ రాజనాల శ్రీహరితో పాటు మరో ఇండిపెండెంట్ ఆడెపు నగేశ్ పోటీ నుంచి తప్పుకోవడంతో 29 మంది బరిలో నిలిచారు.
- వరంగల్ పశ్చిమలో 20 మందికి ఐదుగురు నామినేషన్లను వెనక్కి తీసుకున్నారు. ఇందులో కాంగ్రెస్ రెబల్ క్యాండిడేట్ జంగా రాఘవరెడ్డి ఏఐఎఫ్‍బీ తరఫున వేసిన నామినేషన్‌ను వెనక్కి తీసుకొని పోటీ నుంచి తప్పుకున్నారు. అలాగే ఇమ్మడి రవియాదవ్, ఉల్లెంగల యాదగిరి, జన్ను మధు, సీత రాజ్‌కుమార్ కూడా విత్‌డ్రా చేసుకోవడంతో 15 మంది పోటీలో నిలిచారు.
- నర్సంపేట నియోజకవర్గంలో 19 మంది పోటీలో ఉండగా నూనె అనిల్, ముస్క అమర్, గడ్డం అంజనేయులు నామినేషన్లు వెనక్కి తీసుకున్నారు. దీంతో ఎన్నికల బరిలో 16 మంది ఉన్నారు.
- వర్ధన్నపేటలో 20 మందికిగానూ ఆరుగురు ఆరూరి నిర్మల, ఇసంపల్లి వేణు, ఇల్లందుల శోభన్‍బాబు, జోగు శ్యామ్, తాటికాయల సతీష్, ఐత ప్రవీణ్ బరి నుంచి తప్పుకున్నారు. దీంతో 14 మంది పోటీలు ఉన్నారు.
- పరకాల నియోజకవర్గంలో 36 మంది పోటీలో ఉండగా బుధవారం ఎనిమిది మంది విత్‌డ్రా చేసుకున్నారు. దీంతో 28 మంది బరిలో నిలిచారు.
- జనగామ నియోజకవర్గంలో 27 మంది క్యాండిడేట్లకు 8 మంది విత్‌డ్రా చేసుకోవడంతో 19 మంది ఎన్నికల బరిలో నిలిచారు.
- స్టేషన్‌ఘన్‌పూర్‌లో 23 మందికి బుధవారం నలుగురు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో 19 మంది పోటీలో ఉన్నారు.
- పాలకుర్తి నియోజకవర్గంలో 22 మంది క్యాండిడేట్లకు ఏడుగురు విత్‌డ్రా చేసుకోగా, ప్రస్తుతం 15 మంది పోటీ పడుతున్నారు.
- భూపాలపల్లిలో మొత్తం 25 మంది నామినేషన్లు ఫైనల్ కాగా బుధవారం ఇద్దరు విత్‌డ్రా చేసుకున్నారు. దీంతో 23 మంది బరిలో ఉన్నారు.
- ములుగులో 16 మంది నామినేషన్లు వేయగా అంగోతు తారక, పోరిక సోమనాయక్, బడే విద్యాసాగర్, భూక్య అమర్‌సింగ్, మడే పూర్ణిమ నామినేషన్లను విత్‌డ్రా చేసుకున్నారు. దీంతో 11 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.