- ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడి
ఇస్లామాబాద్ : పొరుగు దేశం పాకిస్తాన్లో మంకీపాక్స్ కలకలం రేపింది. స్వీడన్ తర్వాత ఈ దేశంలో ఈ వైరస్ కేసులు వెలుగుచూశాయి. దేశంలో ముగ్గురికి మంకీపాక్స్ వైరస్ సోకినట్టు పాకిస్తాన్ ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఇంటర్నేషనల్ మీడియా ప్రకారం.. పాకిస్తాన్‌కు చెందిన ఈ ముగ్గురు వ్యక్తులు ఈ నెల 3న యూఏఈనుంచి వచ్చారు. వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో వైద్య పరీక్షలు చేయించుకోగా మంకీ పాక్స్ ఉన్నట్టు తేలింది. దేశంలో 3 మంకీ పాక్స్ కేసులు నమోదైనట్టు పెషావర్‌లోని ఖైబర్ మెడికల్ వర్సిటీ వెల్లడించింది.
వారి సహప్రయాణికులతోపాటు సన్నిహితులను గుర్తించి, పరీక్షలు నిర్వహిస్తున్నట్టు పేర్కొంది. కాగా, మంకీపాక్స్ మహమ్మారి ఆఫ్రికా దేశాల్లో కలకలం సృష్టించడంతో ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. నిరుడు కూడా పాకిస్తాన్లో మంకీపాక్స్ కేసులు వెలుగు చూశాయి. అయితే, ఈ సారి వైరస్ బయటపడ్డ ముగ్గురికి ఏ వేరియంట్ సోకిందో స్పష్టత లేదు.
ఎలా వ్యాప్తి చెందుతుందంటే?
- మంకీపాక్స్ వైరస్ తాకడం వల్ల ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది
- వ్యాధి సోకిన వారి చర్మం లేదా నోరు లేదా జననేంద్రియాల గాయాలతో ప్రత్యక్ష సంబంధం ద్వారా వ్యక్తి నుండి వ్యక్తికి సోకుతుంది.
- రోగులు వాడిన దుస్తులు, ఇతర వస్తువుల వినియోగం, టాటూల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వచ్చే చాన్స్ ఉంది.
- ఈ వ్యాధి సోకిన జంతువులను తాకడం, కొరకడం, కళేబరాలను ముట్టుకోవడం వల్ల మనుషుల్లోకి వైరస్ ప్రవేశిస్తుంది.
లక్షణాలివే..
- మంకీపాక్స్ వైరస్ మనిషి శరీరం లోపలికి ప్రవేశించిన తర్వాత 1 నుంచి 21 రోజుల్లో ఎప్పుడైనా లక్షణాలు బయటపడవచ్చు.
- చర్మంపై పొక్కులు, జ్వరం, గొంతు తడారడం, గొంతు, వెన్ను నొప్పి, తల, కండరాల నొప్పులు, లింఫ్ గ్రంథుల వాపు, సత్తువ కోల్పోవడంలాంటివి ఉంటాయి.
- ఇవి దాదాపు 2 నుంచి 4 వారాలపాటు కొనసాగవచ్చు. ఇవి వ్యక్తి రోగ నిరోధక శక్తిపై ఆధారపడి ఉంటుంది.