వంద రోజుల దగ్గు.. లక్షణాలు ఎంటీ.. ప్రపంచాన్ని వణికిస్తోన్న కొత్త వైరస్

కరోనా సృష్టించిన విలయం నుంచి కోలుకుంటున్న ప్రపంచానికి మరో సవాల్ ఎదురవుతున్నది. వూపింగ్ కాఫ్(కోరింత దగ్గు) అనే వ్యాధి మెల్లమెల్లగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను కలవరపెడుతున్నది. కోరింత దగ్గుతో  చైనా, ఫిలిప్పీన్స్, చెక్ రిపబ్లిక్, నెదర్లాండ్స్ లో ఇప్పటికే అనేక మరణాలు నమోదు కాగా.. బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియాల్లోనూ ఇన్ఫెక్షన్ వ్యాప్తి అధికంగా ఉన్నది.  చిన్నారులు, గర్భిణులకు వ్యాక్సిన్ వేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడమే వ్యాధి వ్యాప్తికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నది.  

కారణాలు, లక్షణాలివే.. 

యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) ప్రకారం.. కోరింత దగ్గు అనే వ్యాధి బోర్డిటెల్లా పెర్టూసిస్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. గాలి ద్వారా ఇతరులకు వేగంగా  సంక్రమిస్తుంది. మనిషి శ్వాసకోశ వ్యవస్థను దెబ్బతీస్తుంది.  కోరింత దగ్గు ప్రారంభ లక్షణాలు సాధారణ జలుబు లెక్కనే ఉంటాయి.- రెండు వారాల తర్వాత విపరీతమైన జ్వరం, తీవ్రమైన దగ్గు కనిపిస్తాయి. ఆరు నుంచి ఎనిమిది వారాలు ఇన్ఫెక్షన్ ఉంటుంది. కొందరిలో 12 వారాలు దీని ప్రభావం ఉంటుంది. అందుకే దీన్ని వంద రోజుల దగ్గు  అని కూడా పిలుస్తారు.

వ్యాక్సిన్ తప్పనిసరి..

వూపింగ్ కాఫ్ ప్రభావం చిన్నపిల్లలపై ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆయా దేశాల ప్రభుత్వాలు తల్లిదండ్రులను అప్రమత్తం చేస్తున్నాయి. వ్యాక్సిన్ తీసుకోవడంలో చిన్నారులు, గర్భిణులు నిర్లక్ష్యం వహించవద్దని హెచ్చరిస్తున్నాయి. కాగా, కోరింత దగ్గు ప్రపంచవ్యాప్తంగా శిశు మరణాలకు ముఖ్యమైన కారణమని  డబ్ల్యూహెచ్ వో ప్రపంచ దేశాలను హెచ్చరించింది. టీకాలు సకాలంలో వేయడంలో నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రజారోగ్య సమస్య కొనసాగుతున్నదని ఆవేదన వ్యక్తం చేసింది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుకునేందుకు వ్యాక్సిన్లు తప్పనిసరి అని పేర్కొంది.

ఏ దేశంలో ఎన్నికేసులంటే..

చైనాలో ఈ ఏడాది తొలి రెండు నెలల్లో 32, 380  వూపింగ్ కాఫ్ కేసులు నమోదయ్యాయి. గతేడాది(1,421 కేసులు)తో  పోలిస్తే ఇది 20 రెట్లు అధికమని తేలింది. ఈ వ్యాధి కారణంగా చైనాలో ఇప్పటికే 13 మంది చిన్నారులు చనిపోయారు. ఒక్క ఫిలిప్పీన్స్ లోనే గడిచిన మూడు నెలల్లో 54 మంది పిల్లలు కోరింత దగ్గుతో ప్రాణాలు కోల్పోయారు. అక్కడ గతేడాది కంటే ఈ ఏడాది 34 రెట్లు ఎక్కువ కేసులు రికార్డయ్యాయని ఫిలిప్పీన్స్ ఆరోగ్య శాఖ రిపోర్ట్ వెల్లడించింది.  బ్రిటన్ లోనూ కేవలం జనవరిలోనే 553 కేసులు నమోదయ్యాయని అక్కడి వైద్యాధికారులు పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలో కూడా గత మూడు నెలల్లో 2,799 వూపింగ్ కాఫ్ కేసులు రికార్ట్ అయినట్టుగా పలు నివేదికలు వెల్లడించాయి.