హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద డెఫ్ అండ్ డంబ్ ఫెడరేషన్ సభ్యులు ధర్నా చేపట్టారు. ఉద్యోగ కల్పనలో తమకు ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఫెడరేషన్ ఫార్ డెఫ్ సంస్థ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. 2016 చట్టం ప్రకారం 4 శాతం ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్ కల్పించాలని కోరారు. 5 శాతం కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. జాబ్ వెరిఫికేషన్ చేయకుండా తమను అవమాన పరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో స్పష్టమైన ప్రకటన చేసి.. తమకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు.
ప్రతి ఏడాది తమకు జీహెచ్ఎంసీ రూ.15 కోట్ల బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. లక్ష బెడ్ రూమ్ లలో ఐదువేల డబుల్ బెడ్ రూమ్ లను తమకు కేటాయించాలని కోరారు. మంత్రి కేటీఆర్ చేస్తున్న ప్రకటనలు పేపర్లకే పరిమితమవుతున్నాయన్న సభ్యులు.. తమకు అమలు కావడం లేదని ఆరోపించారు. రిజర్వేషన్ ప్రకారం రావాల్సిన ఉద్యోగాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో తామూ భాగమేనని, కానీ తమను చాలా చిన్న చూపు చూస్తున్నారని అన్నారు.