ఇజ్రాయెల్, హమాస్ ​మధ్య డీల్​ ఓకే

  • 15 నెలల యుద్ధానికి విరామం.. బందీల విడుదలకు మార్గం సుగమం

జెరూసలేం: ఎట్టకేలకు ఇజ్రాయెల్, హమాస్​మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అమెరికా, ఖతార్​ మధ్యవర్తిత్వంతో సీజ్​ఫైర్, బందీల విడుదల అగ్రిమెంట్​​పై ఇరువర్గాలు సంతకాలు చేశాయి.  దోహా వేదికగా జరిగిన భేటీలో ఈ డీల్​ఓకే అయింది. బందీలను విడుదల చేయడానికి ఇజ్రాయెల్, హమాస్​ మధ్య ఒప్పందం చివరిదశకు చేరుకుందని ఇజ్రాయెల్‌‌ ప్రధానమంత్రి కార్యాలయం కూడా వెల్లడించింది. శుక్రవారం భేటీ అయిన ఇజ్రాయెల్ సెక్యూరిటీ కేబినెట్ కూడా దీనికి ఆమోదం తెలిపింది. దీనికి ప్రభుత్వం గ్రీన్‌‌ సిగ్నల్‌‌ ఇవ్వాలని సిఫార్సు చేసినట్టు ప్రధాని నెతన్యాహు  కార్యాలయం వెల్లడించింది. ప్రభుత్వం నుంచి గ్రీన్​సిగ్నల్​ వస్తే ఆదివారం నుంచి అమల్లోకి వస్తుంది. దీంతో 15 నెలల యుద్ధానికి విరామం పలికే అవకాశం ఉంది.

బందీల కుటుంబాలకు సమాచారం

ఈ ఒప్పందం విషయమై ఇప్పటికే బందీల కుటుంబాలకు సమాచారం ఇచ్చినట్టు ఇజ్రాయెల్​ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. గాజా నుంచి తిరిగి వస్తున్న బందీలను స్వీకరించేందుకు సిద్ధం కావాలని ప్రత్యేక టాస్క్‌‌ఫోర్స్‌‌ను ఆదేశించామని, ఒప్పందం కుదిరిందని వారి కుటుంబాలకు సమాచారం అందించామని నెతన్యాహు చెప్పారు.