గద్వాల జిల్లాలో ఎరువుల బ్లాక్​ దందా

గద్వాల జిల్లాలో ఎరువుల బ్లాక్​ దందా
  • గద్వాల జిల్లాలో డీలర్లు, రిటైలర్ల కుమ్మక్కు
  • కృత్రిమ కొరత సృష్టించి ఎక్కువ ధరకు అమ్మకాలు 
  • వేరే ఎరువులు కొంటేనే  డీఏపీ  ఇస్తమని షరతులు
  • ఓ ఫామ్​, ఇన్​వాయిస్​లేకుండానే.. ఇతర ప్రాంతాల నుంచి అక్రమ రవాణా

 

గద్వాల, వెలుగు: జిల్లాలో ఎరువుల బ్లాక్​ దందా జోరుగా సాగుతోంది. డీలర్లు, రిటైలర్లు కుమ్మక్కై  డీఏపీ  కృత్రిమ కొరత  సృష్టించి రైతులను దోచుకుంటున్నారు. బస్తా రూ.1,350 కి అమ్మాల్సి ఉండగా, రూ.1,850 కి అమ్ముతున్నారు.  కొన్నిచోట్ల వేరే ఎరువులు కొంటేనే డీఏపీ ఇస్తామంటూ షరతులు పెడుతున్నారు.  ధరూర్, గట్టు, మాచర్ల, గద్వాల, అలంపూర్ లో ఈ దందా ఎక్కువగా సాగుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. మన గ్రోమోర్ సెంటర్​లో సైతం వేరే ఎరువులు తీసుకుంటేనే డీఏపీ బస్తాలు ఇస్తామంటూ షరతులు విధిస్తున్నారని రైతులు వాపోతున్నారు. దోపిడీకి అడ్డుకట్ట వేయాలని డిమాండ్​చేస్తున్నారు. 

డీలర్లే  సూత్రదారులు
డీఏపీ ఎరువులను డీలర్లే బ్లాక్ చేస్తున్నారని, ఎవరైనా ఫర్టిలైజర్ షాప్ నిర్వాహకులు అడిగితే కొరత ఉందని చెప్పి ఎమర్జెన్సీ అయితే పలానా రేటుకు ఇస్తామంటూ బేరసారాలు చేసుకుంటున్నారు. జిల్లాలో 15 మంది వరకు డీలర్లు ఉన్నారని, అందరూ ఇదే దందా కొనసాగిస్తూ సీజన్​లో అందిన కాడికి దండుకునేందుకు చూస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. డీఏపీ ఎరువులు ఉన్న షాపులకు వెళ్తే  ఇతర ఎరువులు కొంటేనే డీఏపీ  బస్తాలు ఇస్తామని అది కూడా రూ. 1,850 కి తక్కువ లేదంటూ రైతులకు తేల్చి చెబుతున్నారు. దీంతో రైతులు చేసేది లేక డీఏపీ కొనాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి.

గుట్టుగా బయో ఫెర్టిలైజర్
బయో ఫెర్టిలైజర్ ఎరువులను ప్రభుత్వం బ్యాన్ చేసినప్పటికీ జిల్లాలో  గుట్టు చప్పుడు కాకుండా అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. ధరూర్, కేటి దొడ్డి, గట్టు, మాచర్ల, నందిన్నె, బలిగేరా, ఐజ, అలంపూర్​లో బయో ఫెర్టిలైజర్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.  3,17, 319 బయో ఫెర్టిలైజర్ లను, మిక్చర్ ఎరువులను ప్రభుత్వం బ్యాన్ చేసింది.  అయినప్పటికీ ఓ ఫామ్, ఇన్​వాయిస్​లేకుండా అక్రమంగా వీటిని తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. లారీలకొద్దీ  తీసుకొచ్చి సీక్రెట్​గా షాపు ఓనర్లు తమ ఇండ్ల వద్ద,  ఇతర చోట్ల డంప్​చేసి అమ్ముతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

బయోమెట్రిక్ వినియోగం జాడేది ?
ఫర్టిలైజర్ షాప్ లలో ఎరువులు అమ్మాలంటే రైతు ఆధార్ కార్డు తీసుకొని బయోమెట్రిక్ ఎంట్రీ చేసి వారి వేలిముద్ర ద్వారా అమ్మకాలు జరపాలి. కానీ షాపుల ఓనర్లు అవేవి పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా  అమ్ముతున్నారు. తనిఖీలు చేయాల్సిన అగ్రికల్చర్ ఆఫీసర్లు పట్టించుకోకపోవడంతో ఫర్టిలైజర్ షాప్ ల వారు  అడ్డూ అదుపు లేకుండా పోయిందని రైతులు 
ఆరోపిస్తున్నారు.  

ఎక్కువ రేట్లకుఅమ్మితే కఠిన చర్యలు
ఎమ్మార్పీ కంటే ఎక్కువ రేట్లకు ఎరువులు అమ్మితే కఠిన చర్యలు తప్పవు. డీఏపీ ఎరువులు ఎక్కువ రేట్లకు అమ్ముతున్నట్లు తేలితే ఆ షాపులను సీజ్ చేస్తాం. రైతు ఏ ఎరువులు అడిగితే వాటిని ఇవ్వాలి ఒక్క రైతు కంప్లైంట్​చేసినా కఠిన చర్యలు తీసుకుంటాం. 
- గోవింద్ నాయక్, జిల్లా అగ్రికల్చర్, ఆఫీసర్ గద్వాల