గద్వాల, వెలుగు : కర్నాటక బార్డర్‌లో ఉండే గద్వాల, నారాయణ పేట జిల్లాతో పాటు మహబూబ్‌నగర్, దేవకద్ర నియోజకవర్గాల్లో పెట్రోల్ బంకుల డీలర్లు నయా దందాకు తెరలేపారు. కర్నాటకలో పెట్రోల్, డీజిల్ ఇక్కడి కన్నా రూ. 10 వరకు తక్కువకు దొరుకుతుండడంతో ప్రతిరోజూ 12 వేల లీటర్లు ఉండే ట్యాకర్లను 8 నుంచి 10 దాకా తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో ట్యాంకర్‌కు రూ. 1.20 లక్షల వరకు బెనిఫిట్ ఉంటుండడంతో బార్డర్ ఆవతల ఉంటే బంకులతో డీల్ మాట్లాడుకొని దందా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా మన దగ్గర బార్డర్‌లో ఉండే బంకులు మూత పడుతున్నాయి.
రాత్రి కాగానే ..
ఇక్కడి పెట్రోల్ బంకుల డీలర్లు తెలంగాణ బార్డర్‌కు దగ్గరగా కర్నాకటలో ఉన్న పెట్రోల్ బంకుల నుంచి ఈ దందా చేస్తున్నట్లు తెలుస్తోంది. రాత్రి కాగానే రాయచూర్ టౌన్‌లోని మాన్వి రూట్‌లో ఉన్న మూడు పెట్రోల్ బంకులు, మంత్రాలయం రూటులో ఉన్న రెండు పెట్రోల్ బంకుల నుంచి ఒక్కో ట్యాంకర్‌లో 12 వేల లీటర్ల చొప్పున లోడ్ చేసుకొని తీసుకొస్తున్నట్లు సమాచారం. పెట్రోల్, డీజిల్‌పై కంపెనీ వాళ్లు ఇచ్చే కమీషన్ కన్నా.. కర్ణాటక నుంచి తెచ్చి అమ్మితే మరో రెండున్నర రూపాయలు అదనంగా వస్తుండడంతో ఈ దందాను కొనసాగిస్తున్నట్లు తెలిసింది. డీలర్లే కాకుండా కర్ణాటక బార్డర్‌కు అనుకొని ఉన్న గ్రామాల్లోని వ్యక్తులు కూడా కర్ణాటకలోని పెట్రోల్ బంకుల నుంచి పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేస్తున్నారు. దీంతో బార్డర్‌లో రాష్ట్ర పరిధిలో ఉన్న పెట్రోల్ బంకులు మూతపడుతున్నాయి. ఇప్పటికే కొన్ని బంకులు మూత పడగా.. మిగతా బంకులు కర్నాటక బంకులపై ఆధారపడుతున్నాయి.
పన్నులు తగ్గించకపోవడంతో..
దేశంలో గతంలో ఎన్నడూ లేనంతగా పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగిపోయాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం రెండుసార్లు పన్నులను తగ్గించింది. ఇందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాట్ తగ్గించాలని కోరింది. కర్నాటకలో పన్నులు తగ్గించగా.. లీటర్ డీజిల్ రూ.90, పెట్రోల్ రూ.100 కు దొరుకుతోంది. తెలంగాణలో ప్రస్తుతం లీటర్ డీజిల్ రూ.100, పెట్రోల్ రూ.110 ఉంది. రెండు రాష్ట్రాలకు రూ. 10 తేడా ఉండడంతో.. బార్డర్ బంకులే కాదు.. పరిసర గ్రామాల ప్రజలు కూడా అక్కడి పెట్రోల్‌నే కొంటున్నారు. కాగా, కర్నాటక నుంచి వస్తున్న పెట్రోల్, డీజిల్ ట్యాంకర్లపై ఆయిల్ కంపెనీల పేర్లు ఉంటుండడంతో బార్డర్ చెక్‌పోస్టుల్లో పోలీసులు తనిఖీలు చేయడం లేదు.
బంకులపై నిఘా పెడుతం
కర్నాటక నుంచి డీజిల్, పెట్రోల్ తెచ్చి ఇక్కడ అమ్ముతున్న ఘటనలు మా దృష్టికైతే రాలేదు. ఇక నుంచి బార్డర్‌లో ఉన్న పెట్రోల్ బంకులపై నిఘా పెడుతం. కర్ణాటక బంకుల నుంచి పెట్రోల్, డీజిల్ రాష్ట్రంలోకి రాకుండా చెక్ పోస్టుల్లో తనిఖీలు పెంచుతం.
- రేవతి, సివిల్ సప్లై ఆఫీసర్