- ఫేక్ కస్టమర్ల కట్టడి కోసమే ఈ–కేవైసీ అంటున్న డీలర్లు
- సబ్సిడీపై ఇంకా గైడ్‍లైన్స్ రాలేదంటున్న ఆఫీసర్లు
- ఉత్తుత్తి ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి
వరంగల్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో భాగంగా త్వరలో రూ.500కే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తుందని, ఇందుకోసం డాక్యుమెంట్లు తీసుకుంటోందని వస్తున్న వదంతులతో ఐదు రోజులుగా వినియోగదారులు ఉదయం 6 గంటలకే ఆయా గ్యాస్ ఏజెన్సీల ముందు క్యూ కడ్తున్నారు. హైదరాబాద్‌సహా అన్ని జిల్లాల్లో పనులన్నీ పక్కనబెట్టి గ్యాస్ పాస్బుక్కు, ఆధార్ కార్డులతో గంటల తరబడి లైన్లలో నిల్చుంటున్నారు.
అయితే, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫేక్ కస్టమర్లను గుర్తించేందుకే తాము ఈ–కేవైసీ (ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) చేస్తున్నామని ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు. దీపం, ఉజ్వల పథకం కింద సిలిండర్లు తీసుకుని వినియోగిస్తున్న వారి ఈ–కేవైసీ చేయాలని ఆర్డర్స్ ఉన్నాయంటున్నారు. ఈ– కేవైసీ రెగ్యులర్ ప్రాసెస్ అని, రూ.500కే గ్యాస్ పథకానికి, దీనికి సంబంధం లేదంటున్నారు. జనాలు మాత్రం ఇవేవీ వినకుండా కాళ్ల నొప్పులు పెడుతున్నా..ఆకలితో కడుపులు కాలుతున్నా పని అయిపోయేంత వరకు గ్యాస్ ఏజెన్సీలను వదిలి వెళ్లడంలేదు.
ఫేక్ కస్టమర్ల కట్టడికి..ఈ కేవైసీ
ఏటా రాష్ట్రంలో ఫేక్ సమాచారంతో సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు వాడుకునేవారి సంఖ్య పెరుగుతోంది.దీంతో అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే సిలిండర్లు అందించాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. చనిపోయిన వారు, ఊళ్లు వదిలివెళ్లినవారి పేర్లతో తప్పుడు మార్గాల్లో గ్యాస్ సిలిండర్లు పొందుతున్నవారికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయం తీసుకుంది. అసలైన లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారో తెలుసుకునేలా ఈ–కేవైసీ చేయాలని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ రెండు వారాల కింద సర్క్యులర్ జారీ చేసింది. ఊరురా గ్యాస్ సప్లై చేసే ఏజెన్సీలకు ఈ బాధ్యతను అప్పగించింది. ఇందులో భాగంగా డీలర్లు తమవద్ద గ్యాస్ సిలిండర్లు తీసుకునే కస్టమర్లు ఈ– కేవైసీలో భాగంగా తమ ఆధార్ కార్డుతో వచ్చి.. థంబ్ ఇంప్రెషన్ వేసి ఫొటో దిగి వెళ్లాలని సూచించింది. తద్వారా కేంద్ర సర్కారు తప్పుడు పద్ధతిలో గ్యాస్ సిలిండర్లు పొందేవారికి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తోంది.
రూ.500 గ్యాస్ కోసమని.. తప్పుడు ప్రచారం
గ్యాస్ ఏజెన్సీల్లో వారం, పది రోజుల ముందు నుంచే నిర్వాహకులు కస్టమర్లకు ఈ– కేవైసీ చేస్తున్నారు. ఈ నెల 7న రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎలక్షన్ టైంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ క్రమంలో ప్రస్తుతం రూ.955కు అందిస్తున్న గ్యాస్ ధరను మూడో గ్యారంటీగా రూ.500 అందిస్తున్నారని కొందరు తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. అందుకోసమే ఈ– కేవైసీ చేస్తున్నారని.. ఇది చేసుకోనివారికి రాష్ట్ర ప్రభుత్వం అందించే సబ్సిడీ రాదని ప్రచారం చేశారు. ఇదికాస్తా ఊరురా పాకడంతో కొత్త సమస్యకు కారణమైంది.
గ్యాస్ ఏజెన్సీల వద్ద జనాల పడిగాపులు
రాష్ట్రంలో మొన్నటివరకు ఈ–కేవైసీ చేసుకోవాలని ఏజెన్సీలు సమాచారమిచ్చినా రాని జనాలు..ఇప్పుడు ఈ–కేవైసీ చేసుకోకపోతే సబ్సిడీ రాదని ప్రచారం జరగడంతో వందలాదిగా తరలివస్తున్నారు. తెల్లారకముందే గ్యాస్ ఆఫీసుల ముందు బారులు తీరుతున్నారు. దీంతో మూడు కంప్యూటర్లు, నలుగురైదుగురు సిబ్బందితో ఉండే గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారు. ఒక్కోసారి గంటల తరబడి సైట్ ప్లాబ్రం, నెట్ వర్క్స్‌లో ఉండడంతో పూర్తి కావడంలేదు. జనాలు మాత్రం తమ పనులు వదుకుని..తిండీ తిప్పలు మాని ఉదయం నుంచి సాయంత్రం వరకు లైన్లలోనే నిల్చుంటున్నారు. ఈ జిల్లా ఆ జిల్లా..ఈ గ్యాస్ కంపెనీ, ఆ గ్యాస్ కంపెనీ అనే తేడా లేకుండా రాష్ట్రంలోని అన్ని ఏజెన్సీల ముందు తిప్పలు పడుతున్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కొంత క్లారిటీ ఇస్తే సమస్య తీవ్రత తగ్గే అవకాశాలు ఉంటాయి.
ఈ–కేవైసీతో..రూ.500 గ్యాస్‍కు సంబంధం లేదు
ఆయిల్ కంపెనీల ద్వారా ప్రస్తుతం గ్యాస్ ఏజెన్సీలు చేస్తున్న ఈ –కేవైసీతో.. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్న రూ.500కే గ్యాస్ సిలిండర్ కు ఎలాంటి సంబంధం లేదు. సబ్సిడీ కింద రూ.500కు సిలిండర్ ఇచ్చే పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి గైడ్‍లైన్స్ రిలీజ్చేయలేదు. జిల్లాల్లో కూడా మేము ఎలాంటి ప్రాసెస్ చేయడంలేదు. ఈ విషయంలో జరుగుతున్న తప్పుడు ప్రచారంతో జనాలు ఇబ్బందులు పడుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఈ– కేవైసీ అనేది రెగ్యులర్ ప్రాసెస్. ఫేక్ ప్రచారాన్ని పబ్లిక్ నమ్మొద్దు.
చందన్‍కుమార్ (డీసీఎస్‍ఓ, వరంగల్
రూ.500 గ్యాస్ కోసమంటే వచ్చిన..
మాకు ఇండేన్ గ్యాస్ ఉంది. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం స్కీం పెట్టి ఇప్పుడున్న రూ.955 గ్యాస్ సిలిండర్‍ను రూ.500లకే ఇస్తమని చెప్పింది. ఆధార్ కార్డుతోని వచ్చి ఫొటో దిగిపోతేనే ఆ స్కీం వర్తిస్తదని అంటున్నరు. అందుకే గ్యాస్ ఆఫీస్‌కు వచ్చిన. చూస్తనేమో పెద్ద లైన్ఉన్నది. పొద్దుగాల వచ్చినా ఇంకా కాలే...
గోనెల పద్మ, బాలసముద్రం, హనుమకొండ
పొద్దునొస్తే..మధ్యాహ్నమైనా పనికాలే..
ఈ–కేవైసీ చేసుకుంటేనే రూ.500కు గ్యాస్ సిలిండర్ స్కీంలో సబ్సిడీ వస్తదంటే పొద్దున్నే వచ్చిన. మధ్యాహ్నమవుతున్నా లైన్రెండు అడుగులు కూడా ముందుకు పడలే. నాకన్నా ముందు 20 మంది ఉండగా.. లోపల ఫొటోలు దిగేందుకు ఇంకో 20 మంది ఉన్నరు. నెట్‌వర్క్స్‌లో ఉందని చెబుతున్రు. కనీసం మంచినీళ్లు ఇచ్చేటోళ్లు కూడా లేరు. మల్ల మల్ల ఏమొస్తం..అయిపోయేదాకా ఉండి పని పూర్తి చేసుకునే ఇంటికి పోత..
మగ్గిడి నాగరాణి, దర్గా, ఎన్‍ఐటీ, కాజీపేట