అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్

అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సౌతాఫ్రికా  స్టార్ ప్లేయర్

దక్షిణాఫ్రికా స్టార్ ఓపెనర్, మాజీ టెస్ట్ కెప్టెన్ డీన్ ఎల్గర్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇస్తున్నట్లు ఈ రోజు (డిసెంబర్ 22)  ప్రకటించారు. భారత్ తో జరగబోయే టెస్టు తర్వాత ఎల్గర్ క్రికెట్ కు గుడ్ బై చెప్పనున్నాడు. కొన్ని రోజుల క్రితమే ఈ ఓపెనర్ రిటైర్ అవుతున్నాడనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ర్యాపోర్ట్ వార్తాపత్రిక ఎల్గర్ తన రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్నాడని..భారత్ తో జరిగే టెస్టు సిరీస్ తర్వాత ఈ వెటరన్ ప్లేయర్ క్రికెట్ కు గుడ్ బై చెప్పనున్నాడని తెలిపింది.

తాజాగా.. ఎల్గర్ తన రిటైర్మెంట్ ను అధికారికంగా ప్రకటించాడు. “క్రికెట్ ఆట ఆడటం నాకు ఎప్పటి నుంచో కల. దేశానికి ప్రాతినిధ్యం వహించడాన్ని చాలా గొప్పగా భావిస్తున్నాను. 12 సంవత్సరాలపాటు దక్షిణాఫ్రికా జట్టులో ఉన్నందుకు గర్వంగా ఉంది. స్వదేశంలో  భారత జట్టుతో జరగబోయే  హోమ్ సిరీస్ నా చివరిది. కేప్ టౌన్ టెస్టు నాకు ప్రపంచంలో ఇష్టమైన స్టేడియం. న్యూజిలాండ్‌పై నా మొదటి టెస్ట్ ఇక్కడే ఆడాను". అని ఎల్గర్ తెలియజేశారు. 

2012 లో ఆస్ట్రేలియాపై టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఎల్గర్.. దశాబ్దకాలంగా దక్షిణాఫ్రికా టెస్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. 2023 ఫిబ్రవరిలో ఈ లెఫ్ట్ హ్యాండర్ తన కెప్టెన్సీని కోల్పోయాడు. ఎల్గర్ స్థానంలో బవుమాకు కెప్టెన్సీ దక్కింది. 2024లో న్యూజీలాండ్ తో జరగబోయే సిరీస్ కు కెప్టెన్సీ చేయాలనుకున్నా అది జరగడం దాదాపు అసాధ్యంగానే కనిపిస్తుంది. భారత్ తో రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా డిసెంబర్ 26 నుంచి సెంచూరియన్ లో ఇరు జట్ల మధ్య మొదటి టెస్టు జరగనుంది.  

2018లో ఎల్గర్ తాను దక్షిణాఫ్రికా జట్టుకు చేసిన సేవలకు తనకు తగినంత గుర్తింపు లభించలేదని.. అసంతృప్తిని వ్యక్తం చేశాడు. తనకు, దక్షిణాఫ్రికా క్రికెట్ అభిమానులకు మధ్య పెద్దగా సంబంధం ఉందని అనుకోవట్లేదని.. నేను చేసిన పనిని కార్పెట్ కింద బ్రష్ చేశారని.. తనలాంటి క్రికెటర్లు దక్షిణాఫ్రికా క్రికెట్ అవసరమని సూచించాడు.
  
టెస్ట్ స్పెషలిస్ట్ గా జట్టులో స్థానాన్ని స్థిరం చేసుకున్న ఈ 36 ఏళ్ళ బ్యాటర్.. దక్షిణాఫ్రికా తరఫున 84 టెస్టుల్లో 37.28 సగటుతో 5146 పరుగులు చేశాడు. 13 సెంచరీలు, 23 హాఫ్ సెంచరీలు ఎల్గర్ ఖాతాలో ఉన్నాయి. ఇక 8 వన్డేలు మాత్రమే ఆడిన ఈ స్టార్ ఓపెనర్ కేవలం 104 పరుగులు మాత్రమే చేసి జట్టులో స్థానం కోల్పోయాడు.