![ఆధ్యాత్మికం : మరణం శరీరానికి మాత్రమే... ఆత్మకు కాదు.. !](https://static.v6velugu.com/uploads/2025/02/death-is-only-for-the-body-not-for-soul_C68cA1Yf0U.jpg)
భూమిపై పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పక తప్పదు. గిట్టడం అంటే.. మరణించడం అని అర్దం. మరణించిన తరువాత ఆత్మ బాధపడుతుంది అంటారు. అయితే మరణం శరీరానికి మాత్రమే కాని... ఆత్మకు కాదు..శరీరం ఖననం అవుతున్నా.. దహనమవుతున్నా.. ఆత్మ పడే బాధ అంతా ఇంతా కాదు. మానసిక వత్తిడి లేకపోవటం వల్ల సునాయాసంగా పని చెయ్యటం ఉంటుంది. పైగా జ్ఞానంతో, అంటే తెలిసి చేస్తే బాధ పడటానికి ఏమీ ఉండదు. అందుకని ముందు ఆ విషయాన్ని తెలియచేస్తాడు శ్రీ కృష్ణుడు. శరీరం అన్నది ఆత్మ ధరించే వస్త్రం వంటిది. ఇంకా సరిగ్గా చెప్పాలంటే మనిషి నివాసం ఉండే ఇల్లు వంటిది. ఆత్మని ధరించి కాపాడే పురం వంటిది. ...పురే తేతే ఇతి పురుష్క.... అని పురుష శబ్దానికి వ్యుత్పత్తి కనుక ...తాను.... తన శరీరం... ఒకటి కాదు అనే సత్యం గుర్తు చేయటం జరిగింది.
అర్జునుడు శరీరం పోతుందేమోనని భయపడవలసిన అవసరం లేదు. ఇది వంటపడితే తన కర్తవ్యాన్ని నిర్వర్తించటంలో ఎవరూ వెనుకాడరు. ఈమాత్రం అర్జునుడికి తెలియదని కాదు. పిరికితనం అనే పొర, మమకారం అనే ముసుగు వేసుకుని వచ్చి అర్జునుడి వివేకాన్ని కప్పి వేసింది. దాన్ని తొలగించటమే శ్రీకృష్ణుడు చేసిన పని.
ఆత్మ శాశ్వతం... దానికి పుట్టుకలు లేవు. ఎటువంటి మార్పుని పొందదు. ఇది అర్ధం కావటానికి మంచి పోలిక చెపుతాడు మంచి ఉపాధ్యాయుడు అయిన కృష్ణుడు, శరీరం ఆత్మధరించిన వస్త్రం వంటిది కనుక కట్టుకున్నది పాతపడి, వెలిసిపోయి, చిరిగిపోతే దానిని వదిలి, ఇంకొక దానిని కట్టుకుంటాడు తెలివైనవాడు. అంతే కాని పాతదానిని పట్టుకుని పాకులాడడు. ఉన్నది వదిలితే కొత్తది వస్తుంది. కనుక శోకించవలసిన పని లేదు అంటాడు
Also Read :- బాధ.. నిరాశ.. నిస్పృహలకు శ్రీకృష్ణుడి వివరణ ఇదే..!
కృష్ణుడు... ఒకవేళ ఈ జననమరణాలు ఆత్మకి ఉన్నాయి అని అనుకున్నా... పుట్టిన ప్రతిదీ గిట్టక తప్పదు. ఈ ప్రకృతి నియమాన్ని ఎవరూ ఉల్లంఘించలేరు. అప్పుడు కూడా శోకించవలసిన పనిలేదు అంటాడు కృష్ణుడు. ఈ ప్రాణులన్నీ పుట్టటానికి ముందు కంటికి కనపడవు, చనిపోయాకా కనపడవు. జనన మరణాల మధ్య మాత్రమే మన చర్మచక్షువులకి కనపడతాయి. ఇట్లా కనపడి, అట్లా మాయమయ్యే ఈ జీవుల గురించి శోకించవలసిన పని లేదు అంటాడు కృష్ణుడు. నిజమే కదా. ఈ ఆశ్చర్యకరమైన శాశ్వతసత్యాన్ని గుర్తించే మహానుభావులు చాలా స్వల్పంగానే ఉంటారు. చెప్పేవాళ్లు, వినేవాళ్లు ఉంటే ఉంటారు. కాని, వాళ్ళకి దీని గురించి మాత్రం తెలియదు.
ఆత్మ అనేది ప్రతి జీవిలోనూ ఉంటుంది. శాశ్వతమైనది. అది వధించబడదు. కనుక శోకించవలసిన పని లేదు అంటాడు కృష్ణుడు. నిజానికి అర్జునుడికి పిరికితనం రావటానికి కారణం తాను చనిపోతానేమో అన్న భయంతో పాటు....తనవారు చనిపోతారేమోనన్న భయం. మరణం ఎవరిదైనా అది వారి శరీరానికే కాని, ఆత్మకి కాదు అని ఆశ్వాసన కలిగిస్తున్నాడు శ్రీ కృష్ణుడు. ఎదుటి పక్షంలో ఉన్న తన బంధువులు, మిత్రులని చంపి నెత్తుటికూడు తినటం అవసరమా? అని కదా అర్జునుడు ముందు అన్నది. కనుక బంధుమిత్రులు యుద్ధంలో ప్రాణాలు కోల్పోయినా, అది శరీరం వదలటం మాత్రమే. వారి ఆత్మ చంపబడదు. అది శాశ్వతం. కనుక అర్జునుడు తన వల్ల వారందరు చనిపోయారు అని శోకించ వలసిన పని లేదు అంటాడు కృష్ణుడు.
ఒక్కక్షణం కొంచెం ఆలోచిస్తే ఎవరికైనా తేలికగా అర్ధం అవుతుంది. మనం దేనికోసం శోకించాలి? ఏదైనా శాశ్వతంగా ఉండదు. క్షణంక్షణం మారటం సహజం. పెద్దమార్పు ఈ శరీరం వదలి మరో శరీరం ధరించటమే. మార్పు వల్ల మంచి జరుగుతుంటే బాధ దేనికి? బాధపడనక్కర లేదు అని చెప్పలేదు. భగవానుడు. బాధపడటానికి అధికారం లేదు అన్నాడు. అధికారం లేని పని చేయకూడదు కదా. కాస్త ఆలోచించండి మనం ఎందుకు శోకించాలి అనే విషయాన్ని ఆలోచించాలి.
-వెలుగు,లైఫ్-