నవీన్ కుటుంబానికి అండగా ఉంటాం

నవీన్ కుటుంబానికి అండగా ఉంటాం

ఉక్రెయిన్‌లో కర్ణాటక విద్యార్థి నవీన్ మృతితో ఒక్కసారిగా భారతీయులంతా శోకసంద్రంలో మునిగిపోయారు.  దేశం మొత్తాన్ని అతని మృతి కలచివేసింది. దీంతో నవీన్ కుటుంబ సభ్యులను కర్నాటక సీఎం ఓదార్చారు. ఉక్రెయిన్‌లోని హవేరీకి చెందిన కర్నాటక విద్యార్థి నవీన్ జ్ఞానగౌడ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై. నవీన్ తండ్రి శేఖర్ గౌడ్‌తో ఫోన్‌లో మాట్లాడి కుటుంబ సభ్యులను ఓదార్చారు.నవీన్ గురించి మరిన్ని వివరాలను ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు. ఈ దుఃఖ సమయంలో అతని కుటుంబానికి అండగా ఉంటామన్నారు. "ఇది పెద్ద దెబ్బ. నవీన్‌కు శాశ్వత శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఈ విషాదాన్ని భరించడానికి మీరు ధైర్యంగా ఉండాలి" అని బొమ్మై అన్నారు.

మరోవైపు నవీన్ పార్థివదేహాన్ని భారత్‌కు తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు సీఎం బొమ్మై. ఈ విషయంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులతో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. నవీన్‌ గురించి పలు విషయాల్ని అతని తండ్రి సీఎంకు తెలిపారు. కొడుకు పోయిన దుఖంలో ఉన్న తండ్రి శేఖర్ గౌడ్ తన కొడుకుతో ఉదయమే ఫోన్ లో మాట్లాడానని సీఎంకు చెప్పారు. రోజూ రెండు మూడుసార్లు ఫోన్ చేసేవాడని సీఎంకు ఆయన వివరించారు.