భారత్​లో మరణశిక్ష రాజ్యాంగబద్ధమా?

భారత్​లో మరణశిక్ష రాజ్యాంగబద్ధమా?
  • ఏఐ లాయర్‌కు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రశ్న
  • జవాబు విని అశ్చర్యపోయిన సీజేఐ, ఇతర సిబ్బంది
  • సుప్రీంకోర్టులో నేషనల్ జ్యుడీషియల్ మ్యూజియం ప్రారంభం

న్యూఢిల్లీ:  సుప్రీంకోర్టులో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) లాయర్‌తో సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ముచ్చటించి టెక్నాలజీ పనితీరును పరీక్షించారు. సీజేఐ అడిగిన ప్రశ్నలకు ఏఐ లాయర్ సరైన సమాధానాలు చెప్పడంతో ఆయనతోపాటు సిబ్బంది కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. గురువారం సుప్రీం కోర్టులో నేషనల్ జ్యుడీషియల్ మ్యూజియం అండ్ ఆర్కైవ్ ను సీజేఐ డీవై చంద్రచూడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఏఐ లాయర్‌తో మాట్లాడారు.

"భారత్ లో  మరణశిక్ష రాజ్యాంగబద్ధమేనా..?" అని సీజేఐ అడగగా.. "అవును. భారత్ లో మరణశిక్ష రాజ్యాంగబద్ధమైనది. అత్యంత ఘోరమైన నేరాల్లో సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇస్తుంది. అరుదైన కేసుల్లో దీనిని విధిస్తారు" అని ఏఐ లాయర్ బదులిచ్చారు. ఆ రిప్లైకి ప్రధాన న్యాయమూర్తి ముగ్ధులయ్యారు. ఈ ఇంటరాక్షన్ సమయంలో సీజేఐతో తదుపరి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జడ్జీలు, లాయర్లు కూడా ఉన్నారు. కళ్లజోడు, టై, కోటు ధరించి ఉన్న ఏఐ లాయర్ వీక్షకులను ఆకట్టుకుంది. 

మ్యూజియం యువతకు ఇంటరాక్టివ్ స్పేస్‌

నేషనల్ జ్యుడీషియల్ మ్యూజియం ప్రారంభించిన తర్వాత సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్  మాట్లాడుతూ.. నేషనల్ జ్యుడీషియల్ మ్యూజియం యువ తరానికి ఇంటరాక్టివ్ స్పేస్‌గా మారాలని ఆకాంక్షించారు."మ్యూజియం కాన్సెప్ట్‌లైజేషన్ అండ్ ప్లానింగ్‌కు ఏడాదిన్నర కాలం పట్టింది. దాని అమలుకు ఆరు నెలలు పట్టింది. ఇది కోర్టు సమయంలో జరిగింది. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో జ్యుడీషియల్ మ్యూజియం ఏర్పాటు చేశాం. దీని తద్వారా మన ఇన్ స్టిట్యూషన్స్, హైకోర్టులు పౌరులకు న్యాయం చేయడంలో, ప్రాథమిక హక్కులను పరిరక్షించడంలో ప్రాముఖ్యతను నొక్కి చెప్పాలి” అని  సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు.