యూపీ సీఎం యోగికి బెదిరింపు.. ముంబై పోలీసులకు మెసేజ్​

యూపీ సీఎం యోగికి బెదిరింపు.. ముంబై పోలీసులకు మెసేజ్​
  • గంటల్లోనే నిందితురాలి అరెస్ట్

ముంబై: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్​ను చంపేస్తామంటూ ముంబై పోలీసులకు బెదిరింపు మెసేజ్ వచ్చింది. మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీని కొద్దిరోజుల కింద చంపిన మాదిరిగానే యూపీ సీఎంను చంపుతామని గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ముంబై పోలీస్ కంట్రోల్​ రూం హెల్ప్​లైన్ నంబర్​కు వాట్సాప్ మెసేజ్ వచ్చింది. ‘‘బాబా సిద్ధిఖీలాగే యోగి ఆదిత్యనాథ్​ను చంపుతాం. ఆయన 10 రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేయాలి’’ అని ఆ మెసేజ్​లో పేర్కొన్నారు. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. 

నిందితురాలు ఐటీ గ్రాడ్యుయేట్

అసెంబ్లీ ఎన్నికల ప్రచార కార్యక్రమానికి యోగి ఆదిత్యనాథ్ మహారాష్ట్రకు వచ్చే అవకాశమున్నందున ముంబై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బెదిరింపు వచ్చిన నంబర్​ను కొద్ది గంటల్లోనే ట్రేస్ చేశారు. నిందితురాలిని థానె జిల్లా ఉల్లాస్​నగర్​కు చెందిన 24 ఏండ్ల ఫాతిమా ఖాన్​గా గుర్తించి అరెస్ట్ చేశారు. ఆమె బీఎస్సీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదివారని, తండ్రి టింబర్ బిజినెస్ చేస్తున్నారని తెలిపారు. కుటుంబంతో కలిసి ఉంటున్న ఫాతిమా మానసిక స్థితి సరిగాలేదని గుర్తించినట్లు వెల్లడించారు.

కాగా, అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్​సీపీ) నేత సిద్ధిఖీని గత నెల 12న ముంబైలోని బాంద్రాలో దుండగులు కాల్చి చంపేశారు. ఇది తమ పనే అంటూ గ్యాంగ్​స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించుకోగా.. ఈ కేసులో ఇప్పటివరకు 14 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ హత్య తర్వాత కూడా బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి పలువురికి బెదిరింపులు వచ్చాయి. ఆదివారం ఇదే మాదిరిగా యూపీ సీఎంను చంపేస్తామని మెసేజ్ రావడంతో పోలీసులు సీరియస్​గా తీసుకున్నారు.