ఉత్తరప్రదేశ్: సంభాల్ కోల్డ్ స్టోరేజీ పైకప్పు కూలిన ఘటనలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. గాయపడిన 11 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు. చందౌసి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరానగర్ రోడ్డులో ఉన్న కోల్డ్ స్టోరేజీ ఛాంబర్ మార్చి 16వ తేదీన కూలిపోవడంతో ముందుగా ఇద్దరు చనిపోయిన విషయం తెలిసిందే.
యూపీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మూడు నెలల క్రితమే పాలకవర్గం నుంచి అవసరమైన అనుమతి లేకుండా పైకప్పును నిర్మించారని, కోల్డ్ స్టోరేజీలో నిర్ణీత సామర్థ్యానికి మించి బంగాళదుంపలు నిల్వ ఉంచారని పోలీసులు తెలిపారు. పైకప్పు కూలిన ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటున్నారు. బాధితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చక్రేష్ మిశ్రా తెలిపారు. ఈ ఘటనలో 11 మంది గాయపడ్డారని, వారిని ఆస్పత్రికి తరలించామని చెప్పారు.
SDRF, NDRF బృందాల రెస్క్యూ ఆపరేషన్
సంఘటన జరిగిన వెంటనే ప్రారంభమైన రెస్క్యూ ఆపరేషన్ రాత్రి వరకు కొనసాగింది. ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది. కోల్డ్ స్టోరేజీ యజమానులైన అంకుర్ అగర్వాల్, రోహిత్ అగర్వాల్‌లపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.