- చుట్టుపక్కల 37 వెహికల్స్ దగ్ధం
- జైపూర్-అజ్మీర్ హైవేపై ఘటన
- 35 మందికి పైగా తీవ్ర గాయాలు
జైపూర్ : రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. జైపూర్–అజ్మీర్ హైవేపై ట్రక్కును ఎల్పీజీ ట్యాంకర్ ఢీకొట్టడంతో గ్యాస్ లీకై పెద్ద ఎత్తున పేలుడు సంభవించింది. మంటలు ఎగిసిపడి చుట్టుపక్కల ఉన్న వాహనాలకూ వ్యాపించాయి. ఈ ఘటనలో 11 మంది మృతి చెందారు. 35 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో సగం మంది పరిస్థితి విషమంగా ఉంది. బాధితులకు ఆస్పత్రుల్లో ట్రీట్మెంట్ ఇస్తున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.
చనిపోయినోళ్ల వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. కాగా, ఫైర్ సిబ్బంది స్పాట్‌కు చేరుకుని కొన్ని గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పివేశారు. మంటల్లో 37 వాహనాలు దగ్ధమయ్యాయి. వీటిలో ట్రక్కులు, కంటెయినర్లు, బస్సులు, కార్లు ఉన్నాయి. హైవేపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనాలను పోలీసులు దారి మళ్లించారు.
ప్రమాదం ఎలా జరిగిందంటే?
శుక్రవారం తెల్లవారుజామున 5:30 గంటలకు జైపూర్–అజ్మీర్ హైవేపై ట్రక్కును ఎల్పీజీ ట్యాంకర్ ఢీకొట్టింది. దీంతో గ్యాస్ లీకై పేలుడు సంభవించింది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడి ట్యాంకర్‌కు వెనుక వైపు నుంచి, ముందు వైపు నుంచి వస్తున్న వెహికల్స్‌కు వ్యాపించాయి. ఈ క్రమంలో వెహికల్స్ ఒకదానికొకటి ఢీకొన్నాయి. వాటిల్లో ఫ్యూయల్ ట్యాంకర్లు ఉండడంతో మరిన్ని పేలుళ్లు సంభవించాయి. వాహనాల డ్రైవర్లకు మంటలు అంటుకుని తీవ్ర గాయాలయ్యాయి. కొంతమంది వెహికల్స్ దిగి పరుగులు పెట్టారు.
ఓవైపు ఎగసిపడుతున్న మంటలు, మరోవైపు పెద్ద ఎత్తున పొగ, మంటల్లో కాలిపోతున్న వాహనాలు, బాధితుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. హైవేపై దాదాపు 300 మీటర్ల మేర వాహనాలకు మంటలు వ్యాపించాయని, 10 కిలోమీటర్ల వరకు పేలుడు శబ్దం వినిపించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ట్యాంకర్ వెనుక ఓ ప్రైవేట్ స్లీపర్ బస్సు ఉన్నదని, అది ఉదయ్ పూర్ నుంచి జైపూర్ వెళ్తున్నదని అధికారులు తెలిపారు. ప్రయాణికుల వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు.
రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి..
ఈ ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, రాజస్థాన్ గవర్నర్ హరిభావు బగాడే, సీఎం భజన్ లాల్ శర్మ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల ఫ్యామిలీలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడినోళ్లకు రూ.50 వేల చొప్పున పరిహారం అందజేస్తామని మోదీ ప్రకటించారు.
మహారాష్ట్రలో పెండ్లి బస్సు బోల్తా.. ఐదుగురు మృతి మహారాష్ట్రలోని రాయ్ గఢ్ జిల్లాలో పెండ్లి బస్సు బోల్తా పడి ఐదుగురు చనిపోయారు. మరో 27 మందికి గాయాలయ్యాయని అధికారులు తెలిపారు.