150 మందికి చేరిన రష్యా మృతులు.. మరో 100 మంది ఆస్పత్రిలో.. ఉగ్రదాడిపై పుతిన్ వ్యూహాత్మక మౌనం

రష్యా రాజధాని మాస్కోలోని కాన్సర్ట్‌ హాల్లో జరిగిన ఐసిస్ ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారి సంఖ్య 150కు చేరింది. మరో 100 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో చాలా మంది ఆరోగ్యం విషమంగా ఉందని ప్రకటించారు రష్యా అధికారులు. ఈ ఈ దాడి మేం చేశామంటూ ఐసిస్ ప్రకటించుకోవటంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆగ్రహంతో ఉన్నారు. 

ఆరు నుంచి 14 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలు.. తమ డాన్స్ ప్రదర్శన కోసం కాన్సర్ట్ హాలులో పెద్ద ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈ హాలులో పిల్లలతోపాటు వారి పేరంట్స్ వందల మంది ఉన్నారు. విషయాన్ని ముందే పసిగట్టి.. ఉగ్రదాడికి ప్లాన్ చేసుకున్నారు తీవ్రవాదులు. కాన్సర్ట్ హాలులోకి ప్రవేశించటానికి ఉగ్రవాదులు.. ఆర్మీ దుస్తులు ధరించారు. మొత్తం ఐదుగురు తీవ్రవాదులు.. రష్యా ఆర్మీ దుస్తుల్లో.. కాన్సర్ట్ హాలులోకి ప్రవేశించి.. తుపాకులతో విచక్షణరహితంగా కాల్పులకు తెగబడ్డారు. 

కాల్పుల తర్వాత కన్సర్ట్ హాలుకు నిప్పుపెట్టారు. దీంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. దీంతో హాలు పైభాగం కూలిపోయింది. అత్యంత కిరాతంగా ఉగ్రవాదులు ఈ దాడి చేయటాన్ని.. రష్యా ప్రభుత్వం జీర్ణించుకోలేకుండా ఉంది. 100 మంది రష్యా ప్రజల ప్రాణాలను ఉగ్రవాదులు తీయటాన్ని సహించలేకపోతుంది. చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించింది.

ఉగ్రదాడి వెనక ఉక్రెయిన్ హస్తం ఉందని కొందరు భావిస్తున్నారు. ఈ చర్య ద్వారా ఉక్రెయిన్ పై రష్యా మరింతగా విరుచుకుపడుతుందనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ విషయంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఉగ్రదాడిపై అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. భద్రతను సమీక్షించారు. వైద్యుల సేవలను కొనియాడారు.. బాధితులకు అండగా ఉంటామని మాత్రమే అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. ఉక్రెయిన్ ప్రమేయం ఉన్నట్లు ఎక్కడా ప్రకటించలేదు. 

రష్యాలో జరిగిన ఉగ్రదాడిని అమెరికాతోపాటు పశ్చిమ ఆసియా దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఉక్రెయిన్ దేశానికి మద్దతిస్తున్న దేశాలు అన్నీ కూడా.. పోటీ పడి మరీ రష్యాలో జరిగిన ఉగ్రదానికి ఖండించాయి. రష్యాలో జరిగిన ఉగ్రదాడి ఐసిస్ పనే అని అమెరికా ప్రకటించింది. ఈ విషయాన్ని మాత్రం రష్యా అధ్యక్షుడు పుతిన్ ధృవీకరించటం.. దానిపై ఎలాంటి ప్రకటన చేయకపోవటం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి.. ఆందోళనకు గురి చేస్తుంది.