చర్చనీయాంశమైన పోలీసు​ల బదిలీలు

చర్చనీయాంశమైన పోలీసు​ల బదిలీలు
  • మొన్న ఇద్దరు సీఐలపై వేటు
  • నిన్న ఎస్పీ,  ఇపుడు డీఎస్పీపై యాక్షన్​ 

మెదక్, వెలుగు: జిల్లాలో పోలీస్​ఆఫీసర్ల వరుస బదిలీలు ఇటు డిపార్ట్​మెంట్​లో అటు ప్రజల్లో చర్చనీయాంశయ్యాయి. ఇదివరకు ఇద్దరు సీఐలు, ఆ తర్వాత ఎస్పీ బదిలీ కాగా, ఇప్పుడు డీఎస్పీ బదిలీ అయ్యారు.  గత నెలలో మెదక్​ పట్టణంలో ఇరు వర్గాల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు జరిగిన సంగతి తెలిసిందే. ఓ వ్యక్తిపై కత్తిపోట్లు జరిగిన నేపథ్యంలో బాధితుడి తరపు వర్గానికి, మరో వర్గానికి మధ్య కొట్లాటలు జరిగి  పరస్పరం దాడులకు దారితీసి, హాస్పిటల్స్​, షాప్ప్​ ధ్వంసం కావడంతో పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.  

ఈ క్రమంలో ఇరు వర్గాలకు చెందిన 45 మంది  మీద కేసులు నమోదు కాగా, వారిని అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు. మెదక్ లో ఇరువర్గాల ఘర్షణలకు పోలీసుల వైఖరే కారణమని అప్పట్లో ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. గొడవలకు కారణమైన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడంతోపాటు, సమగ్ర విచారణ జరిపి పోలీసుల నిర్లక్ష్యం ఉన్నట్టయితే వారిపై కూడా శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని అప్పటి మల్టీజోన్ ఐజీ రంగనాథ్​ తెలిపారు. 

ఈ క్రమంలో మెదక్ టౌన్​ సీఐ దిలీప్​కుమార్, రూరల్​ సీఐ కేశవులును బదిలీ చేశారు. ఆ తర్వాత ఉన్నతాధికారులు కొద్ది రోజుల కిందట ఎస్పీ బాలస్వామిని హైదరాబాద్​కు బదిలీ చేశారు. ఆయన మెదక్ ఎస్పీగా వచ్చిన ఆరునెలలకే బదిలీ కావడం గమనార్హం. తాజాగా మెదక్ డీఎస్పీ డి.రాజేశ్వర్​ పై కూడా  బదిలీ వేటు పడింది. ఆయనకు ఎక్కడా పోస్టింగ్​ ఇవ్వకుండా డీజీపీ ఆఫీస్​లో రిపోర్ట్​ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.