మంత్రి పదవులు ఒకటా? రెండా?

  • ఎవరిని వరించేనో అని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చర్చ

నల్గొండ, వెలుగు: ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి రాష్ట్ర మంత్రులుగా ఎవరికి అవకాశం దక్కుతుందనే చర్చ ఊపందుకుంది. సీఎం రేసులో ఉన్న కాంగ్రెస్​పార్టీ అగ్ర నేతలకు ఏ పదవి వరిస్తుందో అని కాంగ్రెస్​శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. మొత్తం 11 స్థానాలు గెలిచి సత్తా చాటిన నేతలకు కీలక పదవులే లభిస్తాయని భావిస్తున్నారు.

నిన్నా మొన్నటి వరకు సీఎం రేసులో ఉన్నామని చెప్పిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్​కుమార్ రెడ్డి ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తున్నారు. పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డితో కలిసి ఢిల్లీ పెద్దలతో చర్చలు జరుపుతున్నారు. సీఎంతోపాటే జిల్లా అగ్రనేతలకు చోటు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. అదే నిజమైతే ఉమ్మడి జిల్లాకు మంత్రి పదవులు ఒకటా.. రెండా? అనేదాని పైన సస్పెన్స్​నెలకొంది.

ఉమ్మడి ఏపీలో జిల్లా నుంచి క్యాబినెట్​లో రెండు బెర్త్​లు దక్కాయి. 2004లో వైఎస్ఆర్ క్యాబినెట్​లో హోం మంత్రిగా జానారెడ్డి పనిచేశారు. 2009లో  కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా చేశారు. వైఎస్ మరణానంతరం రోశయ్య, కిరణ్​కుమార్​క్యాబినెట్​లోనూ  వెంకటరెడ్డి కొనసాగారు. ఉద్యమ నేపథ్యంలో తర్వాత తన పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో ఉత్తమ్​ కుమార్​రెడ్డి కిరణ్​కుమార్​క్యాబినెట్​లో పనిచేశారు. అదే టైంలో జానారెడ్డికి మంత్రిగా అవకాశం దక్కింది. మంత్రిగా ఉంటూనే జానారెడ్డి తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించారు. టీడీపీ హయాంలో ఎలిమినేటి మాదవరెడ్డి చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రిగా పనిచేశారు.


ముఖ్యమంత్రి పీఠం అందని ద్రాక్షేనా?


నల్గొండ జిల్లాకు సీఎం పదవి అందని ద్రాక్షగానే మిగులుతోంది. సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన వీరసేనాని రావి నారాయాణరెడ్డి మొదలు తాజాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్​కుమార్ రెడ్డి, జానారెడ్డి వరకు సీఎం పీఠం కళ్ల ముందు కనిపించినట్టే కనిపించి మాయం అవుతోంది. హైదరాబాద్ రాష్ట్రానికి 1952లో జరిగిన ఎన్నికల్లో రావి నారాయాణరెడ్డి ఆధ్వర్యంలోని పీడీఎఫ్ తెలంగాణ ప్రాంతంలో అత్యధిక స్థానాలు గెలుచుకున్నా మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో ఆశించిన ఫలితాలు సాధించలేదు.

ఆ ఎన్నికల్లో కమ్యూనిస్టులు మెజార్టీ సాధించి ఉంటే హైదరాబాద్​తొలి ముఖ్యమంత్రిగా జిల్లాకు చెందిన రావి నారాయాణరెడ్డి అయి ఉండేవారని రాజకీయ పరిశీలకులు అంచనా. ఆ తర్వాత 1978లో ముఖ్యమంత్రి పదవికి సీనియర్​కాంగ్రెస్​ నేత ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి పేరును పరిశీలించినా చివరకు నిరాశే మిగిలింది. ఉమ్మడి ఏపీలో, తె లంగాణ ఏర్పడ్డాక జానారెడ్డికి సీఎం పదవి వస్తదని ఆశించారు. కానీ గడిచిన రెండు ఎన్నికల్లో కాంగ్రెస్​ఓడిపోయింది. తాజా ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. కానీ సీఎం రేసులో ఉంటానని స్పష్టం చేశారు.