సర్పంచ్​ల పెండింగ్​ బిల్లులపై అసెంబ్లీలో మాటల యుద్ధం

సర్పంచ్​ల పెండింగ్​ బిల్లులపై అసెంబ్లీలో మాటల యుద్ధం
  • అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడీవేడి చర్చ
  • బీఆర్​ఎస్​ అంటేనే బకాయిల రాష్ట్ర సమితి: మంత్రి సీతక్క
  • సర్పంచ్​లకు గత సర్కార్​ రూ. 690 కోట్లు పెండింగ్​లో పెట్టింది​
  • నాడు ఆర్థిక మంత్రిగా ఉన్న హరీశ్​ ఒక్క సంతకం పెడ్తే బకాయిలన్నీ తీరేవి
  • మీ హయాంలో సర్పంచ్​ల ఆత్మహత్యలు మరిచిపోయారా? 
  • వాళ్ల గోసను ఎప్పుడైనా పట్టించుకున్నరా? అని మంత్రి ఫైర్​
  • పల్లెలను కేసీఆర్​ డెవలప్​ చేసిండు.. అందుకే అవార్డులొచ్చినయ్: హరీశ్​ 
  • కాంగ్రెస్​ సర్కార్​ కక్షగట్టి బిల్లులు చెల్లిస్తలేదని ఆరోపణ
  • ప్రభుత్వం సరైన సమాధానం ఇస్తలేదంటూ సభ నుంచి బీఆర్​ఎస్ వాకౌట్

హైదరాబాద్ , వెలుగు: సర్పంచ్​ల పెండింగ్ బిల్లులపై సోమవారం అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీవేడి చర్చ జరిగింది. బిల్లులను కావాలనే ప్రభుత్వం చెల్లించడం లేదని బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే హరీశ్​రావు ఆరోపించగా.. సర్పంచ్​లకు బిల్లులు పెండింగ్​లో పెట్టిందే గత బీఆర్​ఎస్​ సర్కార్​ అని, బీఆర్​ఎస్​ అంటేనే బకాయిల రాష్ట్ర సమితి అని పంచాయతీ రాజ్ మంత్రి సీతక్క విమర్శించారు.  పెండింగ్ బిల్లుల వివరాలన్నీ తాము బీఆర్ ఎస్ వాళ్లకు ఇస్తామని, నాడు ఫైనాన్స్ మినిస్టర్​గా ఉన్న హరీశ్​రావు ఒక్క సంతకం చేస్తే ఇన్ని పెండింగ్ బిల్లులు ఉండేవి కావన్నారు.  గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ల పెండింగ్ బిల్లులపై బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్​రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, చింతా ప్రభాకర్ , కోవా లక్ష్మి, బీజేపీ ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణా రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సీతక్క సమాధానమిచ్చారు. ఆమె మాట్లాడుతూ.. జనాభాకు తగ్గట్టు రిజర్వేషన్లు కల్పించాలన్న ఉద్దేశంతో కులగ‌‌ణ‌‌న జ‌‌రుపుతున్నామని చెప్పారు.

“సర్పంచ్​ల పెండింగ్ బిల్లులను బీఆర్ ఎస్ పార్టీ మాకు వారసత్వంగా ఇచ్చింది.  2014 నుంచి నాటి బీఆర్ ఎస్  ప్రభుత్వం స‌‌‌‌‌‌‌‌ర్పంచుల బిల్లులు చెల్లించలేదు. ఇట్ల రూ. 690 కోట్లు పెండింగ్​ పెట్టింది. పెండింగ్ బిల్లులు వివరాలు అన్ని బీఆర్ ఎస్ వాళ్లకు ఇస్తం. గత ప్రభుత్వంలో ఫైనాన్స్ మంత్రి​గా హరీశ్​ఉన్నారు. ఆయన ఒక్క సంతకం చేస్తే ఇన్ని పెండింగ్ బిల్లులు ఉండేవి కావు. అన్ని క్లియర్ అయ్యేటివి. కానీ, ఎందుకు చేయలేదు? నాడు సర్పంచ్​లు పడ్డ బాధలు అన్నీ ఇన్నీ కావు” అని మంత్రి సీతక్క అన్నారు.

ఎక్కడ పడితే అక్కడ బిల్లులు పెండింగ్​ పెట్టిన్రు

గ్రామ పంచాయతీలకు తమ ప్రభుత్వం వచ్చాక రూ.740 కోట్లు ఇచ్చామని, ఉపాధి హామీ కింద రూ. 450 కోట్లు రిలీజ్ చేశామని మంత్రి సీతక్క వివరించారు.  గత ప్రభుత్వ టైమ్ లో జరిగిన ఉపాధి పనులకు కూడా తామే నిధులు చెల్లించామన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన త‌‌‌‌‌‌‌‌ర్వాత స‌‌‌‌‌‌‌‌ర్పంచుల ప‌‌‌‌‌‌‌‌ద‌‌‌‌‌‌‌‌వీకాలం ఈ ఏడాది ఫిబ్రవరిలో ముగిసిందని, దీంతో కేంద్ర ఆర్థిక సంఘం నుంచి నిధులు ఆగిపోయాయని, కొంత ఇబ్బంది అవుతున్నదని తెలిపారు. ‘‘గత ప్రభుత్వంలో మన ఊరు– మన బడి స్కీమ్ లో  రూ. 1100 కోట్ల పనులు చేస్తే అందులో రూ.800 కోట్లు పెండింగ్​లో ఉన్నాయి. బీఆర్​ఎస్​ అంటేనే బకాయిల రాష్ట్ర సమితి. ఎక్కడ పడితే అక్కడ బిల్లులు పెండింగ్​లో పెట్టింది” అని మంత్రి దుయ్యబట్టారు. ఇప్పుడు అమ్మ ఆదర్శ కమిటీలలో భాగంగా స్కూళ్లు బాగు చేస్తున్నామని,  పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని చెప్పారు. ‘‘మా ప్రభుత్వానికి మీరు(గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం) పెండింగ్ బిల్లులు, అప్పులు, వడ్డీలు బకాయి ఉంచి వెళ్లారు. మేం బిల్లులు చెలిస్తం.  సర్పంచ్ ల బాధ మాకు తెలుసు. మీ(బీఆర్​ఎస్​) హయాంలో వాళ్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎంతో గోసపడ్డారు. నాడు ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్న హరీశ్​రావు ఒక్క సంతకం పెడితే ఇన్ని బకాయిలు ఉండేవి కావు. సర్పంచ్​లు తిప్పలు పడేవారు కాదు” అని అన్నారు. బిల్లులు రిలీజ్ చేయాలని ఫైనాన్స్ మినిస్టర్ ను కోరుతున్నానని తెలిపారు. 

కాంగ్రెస్​ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇయ్యలే: హరీశ్​రావు

పల్లెలను అద్భుతంగా కేసీఆర్​ తీర్చిదిద్దారని.. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి వంటి గొప్ప కార్యక్రమాలు అమలు చేశారని బీఆర్ ఎస్ ఎమ్మెల్యే హరీశ్​రావు అన్నారు. పల్లె ప్రగతికి ప్రతి నెల  రూ. 275 కోట్లు, పట్టణ ప్రగతి కోసం రూ.150 కోట్లు ఇచ్చామని చెప్పారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఏడాది కాలంలో ఒక్క రూపాయి కూడా గ్రామ పంచాయతీలకు ఇవ్వలేదని విమర్శించారు. రూ. 690 కోట్లు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని మంత్రి సీతక్క చెప్తున్నారని.. గత నెలలో బడా బడా కాంట్రాక్టర్లకు రూ.1,200 కోట్లు బిల్లులు చెల్లించారని, కానీ సర్పంచ్ లకు బిల్లులు చెల్లించలేదని ఆయన ఆరోపించారు.  మంత్రులను, గవర్నర్ ను సర్పంచ్​లు కలిసి వినతిపత్రాలు ఇచ్చారని అన్నారు. సర్పంచ్​లు ఎక్కడ ఆందోళనలు చేస్తరేమోనని వారిని ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారని హరీశ్​రావు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారం.. దేశవ్యాప్తంగా ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డులు ప్రకటిస్తే 20కిగాను 19 తెలంగాణ గ్రామాలకు వచ్చాయని.. ఇదంతా గ్రామాలను కేసీఆర్​ అద్భుతంగా తీర్చిదిద్దడంతోనే అని ఆయన అన్నారు. లోకల్ బాడీల నేతలపై కాంగ్రెస్​ ప్రభుత్వం కక్షగట్టిందని, గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయకపోవడం వల్ల గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపించి వ్యాధులు ప్రభలుతున్నాయని తెలిపారు. ‘‘తెలంగాణకు పోతే చికెన్ గున్యా ఉంది, వెళ్లకండి జాగ్రత్త.. అని అమెరికా హెచ్చరించిన దుస్థితి నెలకొంది. ఇది దేశానికి, తెలంగాణకు అవమానం” అని ఆయన అన్నారు. 

బీఆర్​ఎస్​ నేతలు పాపాలు మర్చిపోయిన్రా?: నాయిని రాజేందర్​

బీఆర్​ఎస్​ నేతలు చేసిన పాపాలను మర్చిపోయి ఇప్పుడు వారు నీతులు చెప్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. ‘‘నోరు తెరిస్తే అబద్ధాలు చెప్తున్నరు. ఏడాది కాకముందే మాపై ఇష్టమున్నట్లు విమర్శలు చేస్తున్నరు. ఒక్కొక్కరు వెయ్యి కోట్లు సంపాదించుకొని ఇప్పుడు ఏమీ ఎరుగనట్టు మాట్లాడుతున్నరు. పార్కులను కూడా కబ్జా పెట్టారు. కొత్త సర్కార్​కు సలహాలు, సూచనలు ఇవ్వకుండా యూ ట్యూబుల్లో  తప్పుడు ప్రచారం చేస్తున్నరు” అని దుయ్యబట్టారు. కాగా, పెండింగ్​ బిల్లుల విషయంలో ప్రభుత్వం సరైన సమాధానం ఇవ్వడంలేదంటూ బీఆర్​ఎస్​ సభ్యులు సభ నుంచి వాకౌట్​ చేశారు.