సివిల్ సప్లైపై లొల్లి

సివిల్ సప్లైపై లొల్లి
  • పదేండ్లలో రేషన్ కార్డులు తగ్గాయి: మంత్రి ఉత్తమ్
  • ఆరున్నర లక్షల కార్డులుఇచ్చాం: గంగుల
  • మా లెక్క తప్పయితే రాజీనామా చేస్తా: కేటీఆర్
  • కుంభకోణంపై హౌజ్ కమిటీ వేయాలని డిమాండ్

హైదరాబాద్, వెలుగు: సివిల్ సప్లైలో కుంభకోణం, రేషన్ కార్డుల పంపిణీపై సభలో మంగళవారం అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. పదేండ్లలో అరకొర రేషన్ కార్డులు ఇచ్చారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. దీనిపై బీఆర్ఎస్  ఎమ్మెల్యే గంగుల కమలాకర్  స్పందిస్తూ.. తమ హయాంలో 6.47 లక్షల రేషన్ కార్డులు ఇచ్చామన్నారు. సన్నబియ్యం కొన్నారో లేదో క్లారిటీ ఇవ్వాలని కోరారు. తమ హయాంలో రెండోసారి టెండర్  పిలిస్తే ఎందుకు రద్దు చేశారని నిలదీశారు. 

35 లక్షల మెట్రిక్  టన్నులకు టెండర్ల వివరాలను బహిర్గతం చేయాలని, దీన్ని సభా సంఘం ముందు పెట్టాలని గంగుల డిమాండ్  చేశారు. దీన్ని తిరస్కరిస్తున్నట్లు మంత్రులు ప్రకటించారు. దీంతో బీఆర్ఎస్  ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కలుగజేసుకొని సభ జరిగేలా సహకరించాలని కోరారు. అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వర్  పద్దులపై వివరణ ఇచ్చేందుకు ప్రయత్నం చేయగా, బీఆర్ఎస్  సభ్యులు నిరసన కొనసాగించారు. దీంతో మంత్రి శ్రీధర్ బాబు కలుగజేసుకొని..  ప్రతిఒక్కరూ సమాధానమిస్తున్నామని,  అయినా ఆందోళన చేయడం సరికాదన్నారు. అయినా, బీఆర్ఎస్  సభ్యులు నిరసన ఆపలేదు.

 దీంతో భట్టి సీరియస్  అయ్యారు.  అనంతరం కేటీఆర్  మాట్లాడుతూ... సన్నబియ్యం ఇస్తామని, కొత్త కార్డులు ఇస్తామని ప్రభుత్వం చెప్పడం పై స్వాగతిస్తున్నామన్నారు. తాము రేషన్  కార్డులు ఇవ్వలేదని చెప్పడం సరికాదని, 6.47 లక్షల కొత్త కార్డులు ఇచ్చామని, ఇది తప్పైతే తాను రాజీనామా చేస్తానని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. సివిల్  సప్లయ్  శాఖలో సన్నబియ్యం కొనుగోళ్లలో రూ. 11 వందల కోట్ల స్కామ్  జరిగిందని కేటీఆర్  ఆరోపించారు. ఈ కుంభకోణంపై హౌజ్  కమిటీ వేసి విచారణ జరిపించాలని ఆయన డిమాండ్  చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం తీరుకు నిరసనగా అసెంబ్లీ నుంచి బాయ్ కాట్  చేస్తున్నామని తెలిపారు. అనంతరం పలు పద్దులపై సభ ఆమోదం తెలిపింది.