ములుగు, వెలుగు : అసెంబ్లీ ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించడంలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకమని జనరల్ అబ్జర్వర్ సవిన్ బన్సల్ చెప్పారు. ములుగు కలెక్టరేట్‌లో శుక్రవారం మైక్రో అబ్జర్వర్లకు నిర్వహించిన ట్రైనింగ్‌లో కలెక్టర్ ఇలా త్రిపాఠి, రిటర్నింగ్ ఆఫీసర్ అంకిత్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బన్సల్ మాట్లాడుతూ మైక్రో అబ్జర్వర్లు తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రంలో ప్రతీ అంశాన్ని నిశితంగా పరిశీలించాలని ఆదేశించారు. పోలింగ్ టీంతో స్నేహపూర్వకంగా ఉంటూ తగిన సూచనలు చేయాలని, పోలింగ్ ప్రారంభం అయినప్పటి నుంచి ముగిసే వరకు జరిగే సంఘటనలను ఎప్పటికప్పుడు తెలియజేయాలన్నారు.
ప్రచారానికి పర్మిషన్ తీసుకోవాలి
వివిధ పార్టీల ప్రతినిధులు, మీడియాతో కలెక్టర్ ఇలా త్రిపాఠి వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రచారం కోసం 24 గంటల ముందే పర్మిషన్ తీసుకోవాలని సూచించారు. నిబంధనలు పాటించని వారిపై రిటర్నింగ్ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేయాలని చెప్పారు. నియోజకవర్గంలోని 303 పోలింగ్ కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించినట్లు చెప్పారు. కంట్రోల్ రూంకు చేరిన ప్రతి ఫిర్యాదును పరిష్కరిస్తున్నామన్నారు సమావేశాల్లో డీపీఆర్‌వో రఫిఖ్ పాల్గొన్నారు.
ఎన్నికల నిర్వహణకు సహకరించాలి
వర్ధన్నపేట, వెలుగు : ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సహకరించాలని జనరల్ అబ్జర్వర్ ఎస్.షణ్ముక రాజన్, పోలీస్ అబ్జర్వర్ రాజేశ్‌కుమార్, వ్యయ పరిశీలకుడు అమిత్ ప్రతాప్‌సింగ్ సూచించారు. వర్ధన్నపేట రిటర్నింగ్ ఆఫీస్‌లో శుక్రవారం నిర్వహించిన మీటింగ్‌లో రిటర్నింగ్ ఆఫీసర్ అశ్విని తానాజీ వాఖడేతో కలిసి మాట్లాడారు. క్యాండిడేట్లు ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల్లోపే ప్రచారం చేసుకోవాలని సూచించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లా అండ్ ఆర్డర్‌కు విఘాతం కలిగించే పోస్టులు పెట్టొద్దని సూచించారు. సంజీవరెడ్డి, రామిరెడ్డి, నాగనారాయణ పాల్గొన్నారు.
పాంప్లెంట్స్ ప్రింటింగ్‌కు పర్మిషన్ తప్పనిసరి
మహబూబాబాద్, వెలుగు : పర్మిషన్ లేకుండా ఎన్నికల ప్రచార సామగ్రి ముద్రించినా, పంపిణీ చేసినా చర్యలు తప్పవని మహబూబాబాద్ కలెక్టర్ శశాంక హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో మాట్లాడుతూ పాంప్లెంట్స్ ముద్రించేందుకు కూడా పర్మిషన్ తీసుకోవాలన్నారు. అనంతరం ఓటర్లకు స్లిప్‌లు పంపిణీ చేశారు. ఎంసీసీ కన్వీనర్, డీపీఆర్‌వో శ్రీనివాసరావు, జడ్పీ డిప్యూటీ సీఈవో నర్మద, సోషల్ మీడియా అబ్జర్వర్ సురేశ్ పాల్గొన్నారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఓటు హక్కుపై అవగాహన కల్పించేందుకు పలు ఆటల పోటీలు నిర్వహించారు.
అడిషనల్ బ్యాలెట్ యూనిట్ల కేటాయింపు
జనగామ అర్బన్, వెలుగు : జనగామ నియోజకవర్గ పరిధిలో అడిషనల్ బ్యాలెట్ యూనిట్ల కేటాయింపును జనరల్ అబ్జర్వర్ కె.రాజమణి, జిల్లా ఎన్నికల అధికారి శివలింగయ్య, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో శుక్రవారం పూర్తి చేశారు. జనగామ నియోజకవర్గంలో 19 మంది బరిలో ఉన్నందున అదనంగా 347 బ్యాలెట్ యూనిట్లను
కేటాయించినట్లు చెప్పారు.