తెలంగాణ రైతుపై అప్పుల బరువు!

రాష్ట్రంలో ఎక్కువ మంది చిన్న, సన్నకారు రైతులే. వారంతా ఎన్నో ఏండ్లుగా అప్పులపాలై ఉన్నారు. వీరికి ప్రభుత్వం నుంచి అందుతున్న సాయం అంతంత మాత్రమే. బ్యాంకు లోన్లు అందవు. ప్రైవేటు రుణాలే ఆధారం. వీరికి న్యాయమైన కొనుగోలు ధర లభించదు. సాంకేతిక సాయం అందించగలిగే వ్యవస్థా లేదు. పంట నష్టపోతే పరిహారమూ దొరకదు. వ్యవసాయ అనుబంధ రంగాల నుంచి వస్తున్న రాబడీ తక్కువే. వ్యవసాయాన్ని పండుగ చేస్తామన్న టీఆర్ఎస్​ ప్రభుత్వం.. ఆ దిశలో తీసుకున్న చర్యలు దాదాపు శూన్యం. దీంతో ఉపాధి చూపని వ్యవసాయాన్ని వదిలేస్తున్న వారి సంఖ్య ఏటా పెరుగుతున్నది. పెట్టుబడి సాయం వ్యవసాయ అభివృద్ధికి ఏకైక అంశం కాకూడదు. సమగ్ర వ్యవసాయ విధానం ఉండాలి. అప్పుడే అప్పుల ఊబిలో కూరుకుపోతున్న రైతులకు కొంతైనా మేలు కలుగుతుంది.

రాష్ట్రంలో వ్యవసాయ రంగం పరిస్థితిని తెలియచెప్పే నివేదికను నేషనల్​ స్టాటిస్టికల్​ ఆఫీస్​ గత నెలలో విడుదల చేసింది. గ్రామీణ కుటుంబాల వ్యవసాయ కమతాల సైజు, రైతుల ఆర్థిక పరస్థితులపై 2019లో జరిగిన సర్వే ఆధారంగా ఈ నివేదిక రూపొందింది. నేషనల్​ స్టాటిస్టికల్​ కమిషన్​ సమాచారం వాస్తవికంగానూ, సమగ్రంగానూ ఉంటుంది కాబట్టి రాష్ట్ర వ్యవసాయ రంగం సంపూర్ణ స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ఈ నివేదిక ఉపయోగపడుతుంది.

పల్లెల్లో వ్యవసాయమే ఆధారం

తెలంగాణలో మొత్తం 49 లక్షల కుటుంబాలు గ్రామాల్లో నివసిస్తున్నాయి. ఇందులో 54.2 శాతం కుటుంబాలు వ్యవసాయాన్ని నమ్ముకొని బతుకుతుండగా.. 45.8 శాతం కుటుంబాలు వ్యవసాయేతర పనులు చేసుకుంటున్నాయి. వ్యవసాయంపై ఆధారపడి బతుకుతున్న కుటుంబాల సగటు భూ విస్తీర్ణం 2.13 ఎకరాలు. ఐదు ఎకరాల లోపు భూమి కలిగిన రైతులు సుమారు 73 శాతం ఉంటారు. కమతాల సంఖ్య సుమారు 27.54 లక్షలు. నేషనల్​ స్టాటిస్టికల్​ కమిషన్​ నివేదిక ప్రకారం భూమి కౌలుకు తీసుకున్న కుటుంబాలు 11.3 శాతం. సగటున ఒక్కో కౌలు రైతు 1.45 ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. సగటున కౌలుకు ఇచ్చిన కుటుంబాలు 3.8 శాతం. వారు కౌలుకు ఇచ్చిన సగటు భూమి విస్తీర్ణం 2.82 ఎకరాలు. ఈ నివేదిక ప్రకారం చిన్న, సన్నకారు రైతులే మన రాష్ట్రంలో అధికంగా ఉన్నారు.

వ్యవసాయ ఆదాయం చాలా తక్కువ

వ్యవసాయంపై ఆధారపడిన వారి ఆదాయం మన రాష్ట్రంలో చాలా తక్కువ. మొత్తం మీద కూలీ పైకంతో కలుపుకొని చూస్తే వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాలకు సగటున నెలకు ఖర్చులు తీసేసిన తర్వాత మిగిలే నికర ఆదాయం రూ.9,403. జాతీయ సగటు కంటే ఇది చాలా తక్కువ. జాతీయ సగటు రూ.10,218. మిగతా రాష్ట్రాల్లో వ్యవసాయ కుటుంబాల ఆదాయం ఎక్కువ. అందులో మేఘాలయ ఒకటి. అక్కడ వ్యవసాయ కుటుంబ ఆదాయం రూ.26,973. పంజాబ్ లో రూ.21.703. 21 రాష్ట్రాల్లో వ్యవసాయ కుటుంబాల ఆదాయం.. మన రాష్ట్రంలోని వ్యవసాయ కుటుంబాల ఆదాయం కన్నా ఎక్కువ. సాగు కోసం రైతులు చేసే వ్యయం మన రాష్ట్రంలో నెలకు రూ.6,543. ఈ విషయంలో మనకంటే 24 రాష్ట్రాల్లో ఖర్చు తక్కువ. హర్యానా, పంజాబ్ లో మాత్రమే మనకన్నా ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. జాతీయ సగటు వ్యయం రూ.2,959. జాతీయ స్థాయిలో ఖర్చులు పోను రైతుల నికర ఆదాయం రూ.4,001. అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, మిజోరం, పంజాబ్, ఉత్తరాఖండ్, మేఘాలయ రైతుల నికర ఆదాయం మన రాష్ట్ర రైతుల నికర ఆదాయం కన్నా ఎక్కువ. ఖర్చులు పోను హర్యానా రైతుల నికర ఆదాయం రూ.12,019 కాగా.. పంజాబ్ రైతు ఆదాయం రూ.17,063, మేఘాలయ రైతు ఆదాయం రూ.21,060.  అయితే ఇతరేతర మార్గాల ద్వారా వచ్చే ఆదాయం కూడా ఇతర రాష్ట్రాల్లో చాలా ఎక్కువ.

91.7 శాతం రైతులకు అప్పులున్నయ్

మన రాష్ట్రంలో ఎక్కువ మంది రైతులు అప్పులపాలవుతున్నారు. మొత్తం 91.7 శాతం మంది రైతులు రుణగ్రస్తులుగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే మన కన్నా ఎక్కువ మంది రైతులు అప్పుల్లో ఉన్నారు. అక్కడ 93.2 శాతం మంది రైతులకు అప్పులున్నాయి. మన రాష్ట్ర రైతుల సగటు అప్పు రూ.1,52,113. సగటు అప్పు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు మరో నాలుగు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రైతుల సగటు అప్పు రూ.2,45,554. హర్యానా రైతుల సగటు అప్పు రూ.1,82,922. కేరళ రైతుల సగటు అప్పు రూ.2,42,482. ఇక ఒడిశా రైతుల సగటు అప్పు రూ.2,03,249. కాకపోతే ఏపీ మినహా మిగతా మూడు రాష్ట్రాల్లో అప్పుల పాలైన రైతుల సంఖ్య తక్కువ. హర్యానాలో 47.5 శాతం, కేరళలో 69.9 శాతం, ఒడిశాలో 54.4 శాతం మంది రైతులకు అప్పులున్నాయి. జాతీయ స్థాయిలో 50.2 శాతం మంది రైతులకు అప్పులున్నాయి. జాతీయ స్థాయిలో సగటు అప్పు రూ.74,131. కాకపోతే మన రాష్ట్రానికి, ఇతర రాష్ట్రాలకు ఒక తేడా ఉంది. చాలా రాష్ట్రాల్లో బ్యాంకులు, సహకార సంఘాల నుంచి రైతులు తీసుకుంటున్న అప్పు ఎక్కువ. వడ్డీ వ్యాపారస్తుల నుంచి తీసుకునే అప్పు తక్కువ. కానీ మన రాష్ట్రంలో పరిస్థితి రివర్స్​లో ఉంది. రాష్ట్ర రైతుల అప్పులు 24.8 శాతం వాణిజ్య బ్యాంకుల నుంచి తీసుకున్నవి. గ్రామీణ బ్యాంకుల నుంచి తెచ్చిన అప్పు 8.2 శాతం. సహకార సొసైటీలు, సహకార బ్యాంకుల నుంచి తెచ్చిన అప్పు 3.7 శాతం. పొదుపు సంఘాల నుంచి సమకూర్చుకున్న అప్పు 4.6 శాతం. ఇతర సంస్థాగత రుణాలు 1.2 శాతం. అలాగే సాగు కోసం అప్పు ఇచ్చే డీలర్ల నుంచి 9.1 శాతం, వడ్డీ వ్యాపారుల నుంచి 41.3 శాతం, ఇతరేతర ప్రైవేటు సంస్థల నుంచి 7.2 శాతం అప్పు తెచ్చుకున్నారు. మొత్తం ప్రైవేటుగా వడ్డీకి తెచ్చుకుంటున్న అప్పు 57.6 శాతం. సంస్థాగత రుణాలు 42.4 శాతం. 

నష్టపోయినా పరిహారం అందుతలేదు

ముఖ్యమైన విషయం ఏమిటంటే వరి విషయంలో మొదటి సర్వేలో 50 శాతం, రెండో సర్వేలో 44 శాతం మక్క విషయంలో మొదటి విడత 63 శాతం, రెండో విడత 54.5 శాతం పత్తి విషయంలో మొదటి విడత 69.7 శాతం, రెండో విడత 47.8 శాతం పంట నష్టం జరిగింది. నీళ్లందకపోవడం, చీడపీడలు పంట నష్టానికి ప్రధాన కారణాలు. పంటకు నష్టపరిహారం పొందగల అవకాశం పత్తి పంట విషయంలో 60 శాతానికి, మక్క విషయంలో 69 శాతం, వరి విషయంలో 74 శాతం మంది రైతులకు ఉన్నా ఎలాంటి బీమా లభించలేదు. బ్యాంక్ లోన్ తీసుకున్న రైతులు మాత్రమే ఇన్సూరెన్స్‌‌‌‌ పొందగలిగారు. మిగతా వాళ్లు ఆ సౌకర్యాన్ని పొందలేదు. పండిన పంటలో అత్యధిక భాగం మార్కెట్‌‌‌‌లో అమ్ముకుంటారు. అందులో సగం మంది రైతులు సంతృప్తి చెందితే, మరో సగం మందికి తగిన ధర రాలేదని, ఆ మొత్తం ఆలస్యంగా ఇచ్చారని అసంతృప్తి వ్యక్తమైంది. ఇదీ తెలంగాణలో వ్యవసాయ రంగం పరిస్థితి.

ఇతర ఖర్చులే ఎక్కువవుతున్నయ్

జాతీయ స్థాయి పరిస్థితి మరో రకంగా ఉన్నది. జాతీయ స్థాయిలో 69.7 శాతం సంస్థాగత అప్పులు కాగా, ప్రైవేట్ అప్పులు 30.3 శాతం. జాతీయ స్థాయిలో వాణిజ్య బ్యాంకులు 44.5 శాతం అప్పు సమకూరుస్తున్నాయి. కేరళలో 48.7 శాతం, హర్యానా 49.8 శాతం, పంజాబ్ లో 65.1 శాతం రైతులు వాణిజ్య బ్యాంకుల నుంచి అప్పు తెచ్చుకుంటున్నారు. హిమాచల్ ప్రదేశ్ లో రైతులు 80.1 శాతం అప్పు బ్యాంకుల నుంచే తెచ్చుకుంటున్నారు. తెలంగాణ రైతులు మొత్తం అప్పులో 46.1 శాతం రోజు వారి వ్యవసాయ ఖర్చుల కోసమే వాడుతున్నారు. మరో 16.9 శాతాన్ని పెట్టుబడి వ్యయంగా ఖర్చు చేస్తున్నారు. జాతీయ స్థాయిలో 25.9 శాతం పెట్టుబడి వ్యయంగానూ, 31.6 శాతం రోజువారీ ఖర్చులకు వాడుకుంటున్నారు. వ్యవసాయేతర వ్యాపారాలకు 3.9 శాతాన్ని వాడుకుంటున్నారు. మన రాష్ట్రంలో 0.9 శాతం మాత్రమే వ్యవసాయేతర వ్యాపార అవసరాలకు వాడుకుంటున్నారు. పెళ్లిళ్లు, ఇతర కార్యాలకు మన రాష్ట్రంలో రైతులు 9.4 శాతం ఖర్చు చేస్తుంటే, జాతీయ స్థాయిలో 6.4 శాతం మాత్రమే ఖర్చు చేస్తున్నారు. వినిమయ అవసరాల కోసం మన రాష్ట్రంలో 8.5 శాతం ఖర్చు చేస్తుండగా.. జాతీయ స్థాయిలో ఇందుకయ్యే ఖర్చు 9.4 శాతం. విద్య, వైద్యం కోసం మన రాష్ట్ర రైతులు 3.4 శాతం ఖర్చు చేస్తుంటే జాతీయ స్థాయిలో 5.4 శాతం ఖర్చవుతున్నది. 

ప్రధాన పంటలు.. వరి, పత్తి, మక్క

మన రాష్ట్రంలో అత్యధిక శాతం రైతులు వరి, పత్తి సాగు చేస్తున్నారు. నేషనల్​ స్టాటిస్టికల్​ కమిషన్​ సర్వే రెండు దఫాలుగా జరిగినది. మొదటిసారి 2018 జులై-–డిసెంబర్, రెండోసారి 2019 జనవరి–-జూన్ మధ్యలో జరిగింది. ఈ రెండు సర్వే ఫలితాలను కలిపి చూసినప్పుడు వరి, పత్తి, మక్క ప్రధాన పంటలుగా కనిపించాయి. మొదటి విడత సర్వే ప్రకారం ప్రతి 1,000 మంది రైతుల్లో 565 మంది వరి, 466 మంది పత్తి, 111 మంది మక్కలు వేశారు. వరి కింద సగటున ప్రతి కుటుంబం 2.34 ఎకరాలు, పత్తి కింద 2.67 ఎకరాలు, మక్క కింద 2.83 ఎకరాలు సాగు చేసింది. మక్క పంట కింద సాగులో ఉన్న భూమిలో 63 శాతం, పత్తిలో 71 శాతం సాగు భూమికి నీటి వసతి  లేదు. వరిలో 6 శాతం దాకా సాగు నీటి సౌకర్యం లేని భూమి ఉన్నది. రెండో సర్వే సమయానికి వరి కింద 2.02 ఎకరాలు, మక్క కింద 1.66 ఎకరాలు, పత్తి కింద 2.15 ఎకరాలను ప్రతి కుటుంబం సగటున సాగు చేసింది. కాకపోతే మొదటి సర్వే నాటికి 98 శాతం సాగు చేస్తే, రెండో సర్వే నాటికి 62.5 శాతం మాత్రమే సాగు చేశారు. సగటున ప్రతి కుటుంబానికి వచ్చిన దిగుబడి, ఆ పంట విలువను బాక్స్​లో చూడవచ్చు.