
- 300 సీసీ ఫుటేజీల పరిశీలన.. పాతనేరస్థుడి పని అని గుర్తింపు
- 9 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం
పద్మారావునగర్, వెలుగు: బెట్టింగ్స్, జూదాల కోసం అప్పులు చేసి, తీర్చేందుకు వెహికల్స్చోరీలు, చైన్స్నాచింగ్స్బాటపట్టిన పాతనేరస్థుడిని పోలీసులు అరెస్ట్చేశారు. దాదాపు 300 సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 9 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నార్త్ జోన్డీసీపీ సాధన రష్మి పెరుమాళ్ శుక్రవారం బేగంపేట పోలీసు స్టేషన్ లో వివరాలు వెల్లడించారు. ఏపీలోని తిరుపతి మధురా నగర్ కు చెందిన పాపని క్రాంతి కుమార్ (32) ఆన్లైన్బెట్టింగ్, జూదం ఆడేందుకు పెద్ద మొత్తంలో అప్పులు చేశాడు. అవి తీర్చేందుకు దొంగతనాల బాట పట్టాడు.
తిరుపతిలోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడి జైలుకు వెళ్లాడు. బయటికి వచ్చాక ఈ నెల 15న సిటీకి వచ్చాడు. 16న చిక్కడపల్లి ప్రాంతంలో తిరుగుతూ ఓ ఇంటి ముందు పార్కు చేసిన బైక్ కొట్టేశాడు. అదే బైక్పై తిరుగుతూ చైన్స్నాచింగ్స్చేస్తున్నాడు. 17న బేగంపేటలోని ఓ ఇంటికి వెళ్లిన క్రాంతికుమార్నిద్రపోతున్న వృద్ధురాలు మెడలోని రెండు తులాల బంగారు గొలుసు లాక్కొని పారిపోయాడు. 19న మారేడుపల్లిలో టులెట్బోర్డు ఉన్న ఇంటికి వెళ్లాడు.
ఇంట్లోని వృద్ధురాలి మెడలోని ఐదు తులాల బంగారు గొలుసు లాక్కొని ఉడాయించాడు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు నిఘా పెట్టారు. మారేడుపల్లి, బేగంపేట ప్రాంతాల్లోని 300 సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి శుక్రవారం నిందితున్ని బేగంపేటలో అరెస్టు చేశారు. 9.4 తులాల బంగారు ఆభరణాలు, బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. క్రాంతి కుమార్ పై ఏపీ, తెలంగాణలో 14 చోరీ కేసులు నమోదైనట్లు డీసీపీ వెల్లడించారు.