విశ్లేషణ: అప్పుల మీద అప్పులు.. జీతాలకు తిప్పలు 

విద్యార్థులు, ఉద్యోగులు సహా అన్ని వర్గాలు కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించకుండా ఎడా పెడా అప్పులు చేసింది. చివరకు ఉద్యోగులకు టైమ్​కు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఉమ్మడి రాష్ట్రం సహా తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఫస్టు తారీఖునే జీతాలు పడేవి. కానీ సీఎం కేసీఆర్​పాలనలో.. జీతాలు ఎప్పుడు పడతాయా? అని ప్రతి ఉద్యోగి ఎదురుచూడాల్సి వస్తోంది. ఎఫ్ఆర్ బీఎం నిబంధనల కింద అందినకాడికి అప్పులు చేసుకోవడం కష్టం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ లకు గ్యారెంటీగా ఉండి అప్పులు పుట్టించి వాడుకోవడాన్ని కేంద్రం సీరియస్ గా తీసుకుంది. దీంతో సారుకు ఊపిరి సలపక కేంద్రాన్ని బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తున్నరు. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులంటే ఎంతో కొంత డబ్బులు ఉంటాయనే పరిస్థితి నుంచి ‘జీతమొచ్చిందా? లేదా?’ అని అందరూ వారిని అడిగే దుస్థితి దాపురించింది. ప్రతీ నెల జీతాలు ఆలస్యం అవుతుండటంతో ఇంటి కిరాయిలు, కిస్తీలు, ఈఎంఐలు కట్టలేక ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. వాటి చెల్లింపు ఆలస్యమై సిబిల్​స్కోరు దెబ్బతిని బ్యాంకుల నుంచి లోన్లు వచ్చే పరిస్థితి లేకుండా పోతోంది. ఎంత సకాలంలో ‘ఈ- కుబేర్’ పోర్టల్​లో ఆన్ లైన్ లో జీతాల ప్రక్రియ మొదలుపెట్టినా చివరకు ‘పెండింగ్ గవర్నమెంట్ అప్రూవల్’ దగ్గర బండి ఆగుతోంది. అంటే, సర్కారు దగ్గర డబ్బుల్లేని కారణంగా జీతాల చెల్లింపులో అసాధారణ జాప్యం జరుగుతున్నదన్నది స్పష్టంగా తెలుస్తోంది. వేతన సవరణ కమిషన్ లో ఒక్కో ఉద్యోగికి నాలుగు నుంచి ఎనిమిది లక్షల నష్టం జరిగిందని ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు. పీఆర్ సీ బకాయిలు పదవీ విరమణ తర్వాత ఇస్తూ, రిటైర్ ఆయిన వారికి వాయిదా పద్ధతిలో చెల్లిస్తూ ఇబ్బంది పెడుతున్నదీ ప్రభుత్వం. పిల్లల చదువులకు, పెళ్లిళ్లకు, వైద్యం కోసం ఉపయోగపడే ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు సకాలంలో అందక ఉద్యోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు.  
 

బడ్జెట్​ పెట్టిన నెల రోజులకే.. 
ఏప్రిల్ నెల జీతాల వ్యవహారం చూస్తే.. మొదటివారం వరకు రాష్ట్రంలోని 33 జిల్లాలకు గానూ14 జిల్లాల్లోని ఉద్యోగులు, టీచర్లకు మాత్రమే జమ అయ్యాయి. మరో 19 జిల్లాల్లోని ఉద్యోగులకు ఎదురు చూపులు తప్పలేదు. ఏప్రిల్ పదో తేదీ తర్వాత రిజర్వ్ బ్యాంక్ దగ్గర అప్పు పుడితేగానీ జీతాలు ఇవ్వలేని పరిస్థితి. రూ.2.56 లక్షల కోట్లతో భారీ బడ్జెట్ ప్రవేశపెట్టిన నెల రోజులకే, ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే జీతాలు ఇచ్చేందుకు ప్రభుత్వం కిందామీదా అవుతోంది. ఇక భవిష్యత్తు ఎలా ఉంటుందోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. టీచర్లు, ఇతర శాఖల ఉద్యోగులకు నెలవారీ జీతాలు చెల్లించేందుకు రూ.2,600 కోట్లు, పింఛనుదారులకు మరో రూ.1400 కోట్లు కావాలి. అంటే జీతాలు, పింఛన్ల కోసం ఏడాదికి రూ.48 వేల కోట్లు ఖర్చవుతాయి. నెలకు రూ.5 వేల కోట్లు చొప్పున ఈ ఏడాది రూ.59 వేల కోట్లు అప్పు తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. అంటే తీసుకునే అప్పులు జీతాలు, పెన్షన్లకే సరిపోతుంది. మద్యం అమ్మకాలు, రిజిస్ట్రేషన్లతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తున్నా పాత అప్పులు, వాటి మిత్తీలకే నెలకు రూ.3 వేల కోట్ల వరకు చెల్లించాల్సి వస్తోంది. రైతులు, దళితులు, ఇతర వర్గాలకు ఉద్యోగులు వ్యతిరేకం కాదు గానీ ప్రభుత్వానికి దూరదృష్టి కొరవడటం, తాము ఊహించిన తెలంగాణకు చాలా దూరంగా కొత్త రాష్ట్రం కునారిల్లడాన్ని వారు సహించలేకపోతున్నారు.
 

సెంటిమెంట్​ రెచ్చగొట్టే యత్నం?
వివిధ కార్పొరేషన్లకు పూచీకత్తుగా ఉండి ప్రభుత్వం రుణం తీసుకున్నా కేంద్రం కిమ్మనకుండా ఉండాలన్నది కేసీఆర్ ప్రభుత్వ వాదన. ఈ ప్రాజెక్టులు పూర్తయితే ఆయా కార్పొరేషన్లు తిరిగి చెల్లించే స్థితికి వస్తాయని ప్రభుత్వం అంటోంది. కానీ ఒక్క కాళేశ్వరం ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ను ఉదాహరణగా తీసుకుంటే ప్రభుత్వ వాదనలో డొల్లతనం బైటపడుతుంది. ప్రపంచంలో ఒక అద్భుతమైందీ ప్రాజెక్టు అని మాటిమాటికీ చెప్పుకుంటున్న ప్రభుత్వం దీని నుంచి డబ్బులు ఎలా సంపాదిస్తుందో చెప్పగలదా?  కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్(పెట్టిన పెట్టుబడికి వచ్చే రాబడి) ఏమిటో ప్రకటించగలదా? రైతులను ఘోరంగా పీల్చి పిప్పిచేస్తే తప్ప అప్పు తీర్చడం సాధ్యం కాదు. ఇలాంటి వాదన చేయడంలో మోసకారితనం, మూర్ఖత్వం కలివిడిగా ఉన్నాయి. పెరుగుతున్న అప్పులతో, జీతాలు సకాలంలో అందక ఉద్యోగుల నుంచి ఎదురవుతున్న నిరసనతో పరిస్థితిని ఎట్లా సవరించాలో తెలియని అయోమయంతో కేసీఆర్, -కేటీఆర్ ద్వయం ఒక పన్నాగం పన్నింది. ఈ దారుణ అవస్థలకు కారణం కేంద్రమేనన్న వాదనను, తద్వారా తమ ప్రధాన ఆయుధం ‘సెంటిమెంట్’ ను ప్రయోగించేందుకు విఫల ప్రయత్నం చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక దిగజారుడు రాజకీయాలు ఎలా చేయవచ్చో కేసీఆర్ తిట్లు, కేటీఆర్ ట్వీట్లు చూస్తే అర్థమవుతుంది. ఈ దుష్ట పన్నాగాన్ని ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర వర్గాల ప్రజలు గుర్తించారు. ఓటుతో  కొట్టడం కోసం వారు ఎదురుచూస్తున్నారు.

అప్పులు చేస్తూ.. కేంద్రంపై గుస్సా?
ప్రస్తుత బడ్జెట్‌లో పన్నేతర రాబడి కింద రూ.30,557.35 కోట్లను అంచనా వేస్తే,  డిసెంబరు నాటికి రూ.5,181.46 కోట్లు మాత్రమే సమకూరింది. ఇందులో భూములను అమ్మడం ద్వారా వచ్చిన ఆదాయమే ఉంది. ప్రధానంగా భూముల అమ్మకం ద్వారా కనీసం రూ.20 వేల కోట్లను రాబట్టాలని భావిస్తున్నారు. ఈ ఏడాది బహిరంగ మార్కెట్‌ నుంచి సేకరించిన అప్పులు పెద్ద మొత్తంలో ఉన్నాయి. 2021–-22 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి తెలంగాణ అప్పులు 2,85,116 కోట్లని ప్రభుత్వం పేర్కొంది. కార్పొరేషన్ లకు పూచీకత్తు ఉండి తీసుకున్న రుణాలు రూ. 1,35,282 కోట్లు. లక్ష్యానికి మించి అప్పులు చేస్తున్నారని అటు కాగ్, ఇటు ఆర్బీఐ చెబుతున్నా.. కేసీఆర్ ప్రభుత్వానికి పట్టడంలేదు. ఇలా ఎడా పెడా అప్పులు చేస్తుంటే తెలంగాణ  మరో శ్రీలంక అయ్యే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. పరిస్థితి మరీ విషమించకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం బాధ్యతతో తీసుకున్న చర్యలు కేసీఆర్ కు ఇబ్బందిగా అనిపిస్తున్నాయి. రాష్ట్రాలు కార్పొరేషన్ల ద్వారా నిధులు సమకూర్చుకుని వాటిని ప్రభుత్వ నిధులు నుంచి తిరిగి చెల్లిస్తున్నందున వాటిని రాష్ట్రాల అప్పులుగానే పరిగణించి ఎఫ్ ఆర్ బీ ఎం కింద లెక్కిస్తామని కేంద్రం తాజాగా ప్రకటించడంతో టీఆర్ఎస్​ప్రభుత్వం కుడితిలో పడిన ఎలుకలా గిలగిలలాడుతోంది.                                                                         - పోరెడ్డి కిషోర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి